బీజేపీ పార్టీ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. పొరపాటున బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోతారని హెచ్చరించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పట్ల బీజేపీ పార్టీ కక్ష్య పెంచుకున్నదని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలు ఇక్కడి బీజేపీ నాయకులను అడిస్తున్నారని, వారు చెప్పిన విధంగా తెలంగాణ బీజేపీ నేతలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓర్వలేక పోతున్నదని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే వచ్చిందని, బీజేపీ చేతిలో పావుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మారాడని గుత్తా సుఖేందర్ రెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాకముందు ప్రజలు ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లో మగ్గిపోయారని, ఇక బీజేపీ కి అధికారం ఇస్తే ఉత్తరాది నాయకుల చెప్పు చేతుల్లోకి తెలంగాణ పోతుందని ఆయన హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని అన్నారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని,తెలంగాణ ప్రజలు తెలివితో తీర్పు ఇవ్వాలని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా దీవెన సభను సక్సెస్ చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: కులాల పేరుతో రాజకీయాలు – గుత్తా ఆవేదన