Saturday, September 21, 2024
HomeTrending NewsAP Politics: పీఠం కోసం పొత్తులు... జిత్తులమారి ఎత్తులు

AP Politics: పీఠం కోసం పొత్తులు… జిత్తులమారి ఎత్తులు

తెలంగాణలో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త సమీకరణాల దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటే టార్గెట్ గా పొత్తుల కోసం జిత్తుల మారి ఎత్తులు వేస్తున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. అవినీతి ఆరోపణలతో టిడిపి అధినేత చంద్రబాబు జైలుకు వెళ్ళాక తెర వెనుక బాగోతాలు చాలానే జరుగుతున్నాయి.

బిజెపి మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన అనూహ్యంగా రాబోయే ఎన్నికల్లో సైకిల్ తో సవారీ చేస్తామని ప్రకటించింది. బాబుతో పొత్తు విషయం బిజెపిని సంప్రదించకుండానే పవన్ తీసుకున్నారా?  చంద్రబాబు అరెస్టు నాటి నుంచి పవన్ కళ్యాణ్ ధర్నాలు, నిరసనల వ్యవహార శైలి చూసి తెలుగు తమ్ముల్లే విస్తుపోయారు. ఇక్కడే మతలబు ఉంది.

2024 శాసనసభ ఎన్నికల్లో టిడిపితో పొత్తు కోసం బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. కమలంతో దోస్తీ చేస్తే ముస్లీం, క్రైస్తవ ఓటర్లు దూరమవుతారనే అంచనాతో బాబు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో బాబు జైలుకు వెళ్ళటంతో రాజకీయంగా బిజెపి అవసరం వచ్చింది. బిజెపి సాయం తీసుకోవాలి… మైనారిటీల ఓట్లు పడాలి అనే కోణంలో చంద్రబాబు…పవన కళ్యాణ్ తో పొత్తుకు సిద్దమయ్యారని వినికిడి.

బాబుతో సయోధ్య కోసమే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పురుందేశ్వరికి ఇచ్చారని అంటారు. బాబు అరెస్టుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో లోకేష్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి పురుందేశ్వరి పాల్గొనటం ఇందుకు నిదర్శనమని టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు.

బాబు జైలులో ఉండగా పార్టీ శ్రేణులకు లోకేష్ ధైర్యం కల్పించలేకపోయారని, ఒక దశలో పవన్ తోడు లేకపోతే ఏంటి భవిష్యత్తు అనే వాతావరణం నెలకొంది. ఇదే అదునుగా బిజెపి వ్యూహాత్మకంగా పవన్ తో రాయబారం నడిపిందని విశ్లేషణలు ఉన్నాయి. ఇది జరుగుతుండగానే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణలో 32 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు.

ఎవరు ఉహించని విధంగా బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. పవన్ తో భేటి అయ్యారు. జనసేన సహకారం తీసుకుంటామని చెప్పి పొత్తులకు తెరలేపారు. చర్చోప చర్చలు జరిగాక 8 సీట్లు కేటాయించారు. కూకట్ పల్లిలో కమల దళం బలంగా ఉన్నా…పార్టీ నేతలు నిరసనలతో గగ్గోలు పెట్టినా జనసేనకు కేటాయించారు. సీటు జనసేనది.. అభ్యర్థి మాత్రం మనవాడే అన్నట్టుగా ఉంది.

వారం రోజుల కింద బిజెపి నుంచి జనసేనలో చేరిన ముమ్మారేడ్డి ప్రేమ్ కుమార్ కు కేటాయించారు. సీమాంధ్ర ఓటర్ల ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత సామాజిక వర్గం వ్యక్తికే టికెట్ ఇవ్వటం గమనార్హం. ఇదంతా బిజెపి కనుసన్నల్లోనే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రధాని సభలో పవన్ పాల్గొనటం..తనకు పెద్దన్న అని ఆకాశానికి ఎత్తటం కాకతాళీయం కాదు. పేకాటలో జోకర్ మాదిరిగా జనసేనను వాడుకుందామని చూసిన చంద్రబాబుకు దీటుగా పవన్ కళ్యాణ్ ను నిలబెట్టిన ఘనత బిజెపికే దక్కుతుంది. అందులో సందేహం లేదు. ఇక మిగిలిందల్లా బిజెపి, టిడిపి, జనసేనలు ఒక జట్టుగా 2024 ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ వ్యవహారాన్ని కమలం నేతలు ఏలా కొలిక్కి తెస్తారో..బాబును ఎలా మెప్పిస్తారో మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత కాంగ్రెస్ టిడిపికి అండగా నిలిచింది. అలాగని హస్తంతో కలిసి ఎన్నికలకు వెళితే అంతే సంగతులు. ఇక వామపక్షాలు మేమున్నాం మీతో అని చంద్రబాబు వెంట పడ్డా పట్టించుకోవటం లేదు. టిడిపి అండ లేకపోతే లెఫ్ట్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావనేది జగమెరిగిన సత్యం.

ఎన్టిఆర్ నుంచి టిడిపి పార్టీ.. చంద్రబాబు ఏలుబడిలోకి వచ్చాక పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఎన్నికలు ముగిశాక అంతా తన ఘనతేనని ఊదరగొట్టి..పొత్తులు వికటించేలా వ్యవహరించి, మిత్రపక్షాలను దూరం చేయటం చంద్రబాబు నైజంగా వస్తోంది. ఈ విషయంలో జనసేన, బిజెపిలకు కూడా చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

-దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్