రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఆరాచక శక్తులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అస్థిర పరచాలని చూస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి శక్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు పన్నుతున్నాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో ఈ రోజు జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. బి అర్ ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వంత పాడుతున్నదని ఆరోపించారు. అలాంటి కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. సిఎం కెసిఆర్ ను, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అందుకు పార్టీ శ్రేణులు సర్వ సన్నద్ధంగా సిద్ధంగా ఉండాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
వావిలాల, మల్లంపల్లి, భిక్యా నాయక్ పెద్ద తండా, హఠ్యా తండా, నారబోయిన గూడెం గ్రామాలకు కలిపి వావిలాల గ్రామంలో, ముత్తారం, వల్మీడి, సిరిసన్న గూడెం, కంబాలకుంట తండా తదితర గ్రామాలకు కలిపి ముత్తారం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఎద్దుల బండి పై ఊరేగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
కాగా, ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావులు కోలాటం, లంబాడా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన ఈ సమ్మేళనాల్లో ఉషా దయాకర్ రావు సిఎం ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు.
ఆత్మీయ సమ్మేళనాలలో గ్రామాలకు అభివృద్ధి వరాలు
ఆత్మీయ సమ్మేళనాలల్లో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి నిధులను మంత్రి మంజూరు చేశారు. మంగళవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో దుర్గమ్మ గుడి కి, మహిళా భవనం కి, గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్గత రోడ్లు, గ్రామాల మధ్య రోడ్లను వేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల్లో 10 వ తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పటించి, కుట్టు మిషన్లు పంపిణీకి హామీ ఇచ్చారు.
మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు వడ్డిస్తూ, వారితో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు.