Sunday, January 19, 2025
HomeTrending Newsవలస నేతలతో పార్టీకి నష్టం : నడ్డాకు బిజెపి నేతల లేఖ

వలస నేతలతో పార్టీకి నష్టం : నడ్డాకు బిజెపి నేతల లేఖ

బిజెపిలో ఉన్న తెలుగుదేశం అనుకూల నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఈ లేఖలో ఎనిమిది మంది నేతలు సంతకాలు చేసి, ఎనిమిది మంది జాతీయ నేతలకు పంపారు. పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు, అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని వారు ప్రస్తావించారు.

తాము పొత్తుకు వ్యతిరేకం కాదని, అభ్యర్దులపైనే అభ్యంతరం ఉందని, టిడిపి గతంలో ఎప్పుడూ గెలవని స్థానాలని బిజెపికి ఇచ్చారని వారు ఆవేదన వెలిబుచ్చారు. అంకితభావంతో పనిచేస్తున్న ఆశావహులను పార్టీ పట్టించుకోలేదని, సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న నేతలకు అవకాశాలు కల్పించాలని వారు లేఖలో కోరారు. బిజెపి తరఫున ఎంపికైన అభ్యర్ధులుగా చెప్పుకుంటున్న వారు టిడిపి ముసుగు వేసుకున్నవారేనని…తెలుగుదేశం పార్టీ ఒక రహస్య అజెండాతోనే వారిని బిజెపిలోకి పంపిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.  పొత్తులో కేటాయించిన సీట్లు చూస్తే ఒక రకంగా పొత్తు ధర్మాన్ని విస్మరించి వెన్నుపోటు పొడిచినట్లేనని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళారు.

ఇప్పటికైనా జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి పరిస్థితిని సరిదిద్దాలని లేఖలో నేతలు కోరారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నేత శాంతారెడ్డితో  సహా మొత్తం ఎనిమిది మంది నేతలు దీనిపై సంతకాలు చేశారు.  మరోవైపు కేవలం ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చే డా. కామినేని శ్రీనివాస్ ను పక్కన పెట్టి కైకలూరు నుంచి సోము వీర్రాజును బిజెపి బరిలోకి దించుతోందనే వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్