Bjp Means Business Corporate Party :
తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏముందని, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతాంగం పంటలు, ధాన్యం పండిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు నీళ్లిచ్చిందా? కరంటు ఇచ్చిందా ? రైతుబంధు, రైతుభీమా పథకాలలో మీ భాగస్వామ్యం ఏంటి అని ప్రశ్నించారు. హైదరబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిజెపి నేతల తీరును ఎండగట్టారు. కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో దాడులు చేస్తున్నారు .. ఏ అర్హతతో మీరు కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారన్నారు.
దేశంలో రైతులను రోడ్డెక్కించిన పుణ్యం బీజేపీ పాలనదే… 70 ఏండ్ల పాలనలో నెలల తరబడి రైతులు వీధులలో ఆందోళన చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. క్వింటాలు వడ్లకు 67,68 కిలోల బియ్యం వస్తాయని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లెక్కలే చెబుతున్నాయని, అటు క్వింటాలుకు 80 కిలోలు వస్తాయని బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని విమర్శించారు. అబద్దాలను ప్రచారం చేయడానికి కనీస ఇంగితజ్ఞానం బీజేపీకి లేదు .. కనీస అవగాహన లేని వారు బీజేపీలో నేతలుగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతుల రెక్కల కష్టంపై బీజేపీ దండయాత్ర చేస్తోందని, బీజేపీ అంటే బిజినెస్, కార్పోరేట్ పార్టీ అన్నారు. రైతుల పట్ల అభిమానం ఉంటే బీజేపీ నేతలు ఢిల్లీ యాత్ర చేసి నల్ల చట్టాలను రద్దు చేయమని కేంద్రాన్ని కోరాలన్నారు. ఉత్తరాదిలో ఆందోళనలో చనిపోయిన రైతులకు పరిహారం రైతు కుటుంబాలకు అందించి క్షమాపణలు కోరాలన్నారు.
బీజేపీ కొనుగోలు కేంద్రాల సందర్శన గర్భవతి దగ్గరకు వెళ్లి వెంటనే బిడ్డను కను .. కను అని అన్నట్లుందని, కొనుగోలు కేంద్రాలలో ఎలాగు జరిగేది కొనుగోళ్లే అన్నారు. కొనుగోళ్లకు ఒక ప్రొసీజర్ ఉంటుంది .. తేమ శాతం, తాలు, మట్టిపెళ్లలు పరిశీలించాల్సి ఉంటుంది .. ఈ మాత్రం కనీస అవగాహన బీజేపీ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. తేమ, తాలు, మట్టి పెళ్లలతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం ఎఫ్ సీఐ ఆమోదిస్తుందా ? ధాన్యం కొనుగోళ్లలో కేవలం రెండు నెలలకే కేంద్రం వడ్డీ ఇస్తుంది .. కానీ కేంద్రం డబ్బులు ఇవ్వడానికే ఆరునెలలు పడుతుందన్నారు. దీనికి సంబంధించి మిగతా వడ్డీ , ఇతర నష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ వికృత చేష్టలను రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి హెచ్చరించారు.
Also Read : క్రీడాకారులకు మంత్రి అభినందన