Saturday, November 23, 2024
HomeTrending Newsఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఉత్తర్వులపై బిజెపి హర్షం

ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఉత్తర్వులపై బిజెపి హర్షం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయమని ఈరోజు (15.11.2022) హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు.

బీజేపీ ప్రతిష్ట దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని, సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్నారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

తప్పు చేసినోళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనని, తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదేనని బండి సంజయ్ పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం పట్ల నమ్మకం ఉందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతోపాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకముందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : ఎమ్మెల్యేల కేసులో.. సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్