Sunday, September 8, 2024
HomeTrending Newsఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు కెసిఆర్ వైఫల్యమే

ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు కెసిఆర్ వైఫల్యమే

ఆర్టీసీ, కరెంటు ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్ మెడలు వంచి బీజేపీ దమ్ము చూపిస్తామని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పేరుతో ఒక్కో లీటర్ పై రూ.40లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ పేరుతో వచ్చే సొమ్మును తగ్గించుకుంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే ఉండదని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. దేశ జీడీపీలో తెలంగాణ టాప్ అని పదేపదే ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ కు ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి సీఎం, కుటుంబ సభ్యులు కుట్ర చేస్తున్నారని, అందుకే ఆర్టీసీ సంఘాలను చీలుస్తున్నారని మండిపడ్డారు. 26వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు మాచారెడ్డి చౌరస్తాలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ రేఖావర్మ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యంశాలు….

ఎండలో ఎండుతున్న. వానలో తడుస్తున్న. నడుం నొప్పి పుడుతుంది. అయినా మీ కోసం వచ్చిన. మీ సమస్యలు, బాధలు వినేందుకే వచ్చిన. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే వచ్చిన. ఆర్టీసీ బస్సులో వెళ్లేది పేదోళ్లే. ఆర్టీసీ కార్మికులు పేదోళ్లే. రేపటి నుండి ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచుతరట. ఊకుంటమా? బీజేపీ దమ్మేందో చూపిస్తా. కేసీఆర్ మెడలు వంచుతం. డీజిల్ ఛార్జీలు పెరిగినయ్ కాబట్టి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతరట. కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నడు. ఎందుకు పెంచాలి. పెట్రోలు ఛార్జీలు లీటర్ కు రూ.26లు వ్యాట్ ద్వారా రాష్ట్రానికి వస్తున్నయ్. దీంతోపాటు కేంద్రం ఇచ్చే వాటా రూ.14లు. మొత్తం ఒక్క లీటర్ కు రూ. 40లు కేసీఆర్ ఖాతాలోకి వెళుతుంది. నీకు పేదోళ్ల మీద ప్రేమ ఉంటే….ఆర్టీసీని కాపాడాలంటే నువ్వు దొబ్బిపోతున్న రూ.40లను తగ్గించుకో.

ఆర్టీసీ కార్మికులు ఈరోజు కుటుంబాన్ని పోషించుకోలేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నరు. 27 మంది ఆత్మహత్య చేసుకున్నరు. వాళ్లకు ఎవరూ లోన్లు ఇవ్వరు. వాళ్లకు పెళ్లి చేసుకుంటానంటే పిల్లలను కూడా ఇవ్వడం లేదు. వాళ్లు బాధల్లో ఉంటే ఏనాడూ ముందుకురాని సీఎం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన సంస్థ ఆర్టీసీ.

జీడీపీలో మనమే టాప్ తెలంగాణ అని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నడో  చెప్పాలి. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి సీఎం, కుటుంబ సభ్యులు కుట్ర చేస్తున్నరు. అందుకే ఆర్టీసీ సంఘాలను చీల్చిండ్రు. అశ్వథ్థామరెడ్డి ని తొలగించిండ్రు. మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ ల పేరుతో టీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ విలువైన స్థలాలను స్వాధీనపర్చుకునే కుట్ర జరుగుతోంది. తక్షణమే ఆర్టీసీ ఛార్జీలను ఉప సంహరించుకోవాలి.

కరెంటు ఛార్జీలను ఉఫ సంహరించుకోవాలి. దొంగ తనంగా కరెంటు అమ్ముకుంటుండు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ప్రజల ఇండ్లకు కరెంటు ఛార్జీలు భారీగా పెంచి నడ్డి విరిస్తుండు. ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారో ప్రజలకు వివరించాలి.

రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. మూడేళ్ల పాపను హత్య చేసిండ్రు. మలక్ పేటలో ఆరేళ్ల పాపను హత్య చేసిండ్రు. వరంగల్, ఖమ్మం సహా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయ్. తెలంగాణ అత్యాచారాల్లో దేశంలోనే నాలుగో స్థానం. హోంమంత్రి కేవలం పాతబస్తీకే. కేసీఆర్ గడీలను కాపలా కాసేందుకే హోంమంత్రిగా ఉన్నరు.

ఇందిరాపార్క్ వద్ద కొన్ని పార్టీలు ధర్నా చేస్తున్నయ్. ఆయా పార్టీలను 80 శాతం డిస్కౌంట్ తో కొనేసిన కేసీఆర్. ఆ పార్టీలు చేస్తున్నవన్నీ టైం పాస్ ధర్నాలే. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రం నుండి రూపాయి పంపితే 5 పైసలు మాత్రమే ప్రజలకు చేరేది. మోదీ హయాంలో రూపాయి పంపితే ఆ రూపాయి మొత్తం ప్రజలకు చేరుతుంది. మోదీ గొప్ప పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అనిల్ అంబానీని పెంచి పోషించింది కాంగ్రెస్సే. ఈరోజు కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్సే. కోవిడ్ వస్తే సేవ చేసిన పార్టీ బీజేపీ మాత్రమే.

కేంద్రం డబ్బులిస్తే…చెరువుల్లో వైకుంఠ ధామాలు నిర్మించి నీట ముంచిన ఘనత కేసీఆర్ దే. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది. చెరువుల్లో వైకుంఠ ధామాలు నిర్మించడం సిగ్గుచేటు. కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లి బందీ అయ్యింది. గడీల పాలన నుండి బంధ విముక్తి చేయాలంటూ రోదిస్తోంది. రండి…అందరం కలిసి కేసీఆర్ పాలనపై పోరాడదాం. గడీల్లో బంధీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిద్దాం…..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖావర్మ ప్రసంగంలో ముఖ్యాంశాలు……

బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే మహిళలకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ బండి సంజయ్ ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అధికారం అందించాలని కోరుతున్నా. మహిళలకు సాధికారికత బీజేపీతోనే సాధ్యం.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, బీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్, కామారెడ్డి జిల్లా ఇంఛార్జీ మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, వరంగల్ అర్బన్, సంగారెడ్డి జిల్లాల ఇంఛార్జీ మురళీధర్ గౌడ్, జయశ్రీ, మహిళా మోర్చా కర్నాటక ఇంఛార్జీ ఆకుల విజయ, రాష్ట్ర నాయకులు నీలం చిన్నరాజు, డాక్టర్ సిద్దిరాములు, వేణుగోపాల్, బాబూరెడ్డి, పొన్నాల వెంకటరెడ్డి, మదనన్న శ్రీనివాస్,తోట బాలరాజు, రాధాక్రిష్ణారెడ్డి, నవీన్ నాయక్, దుంపటి నర్సింహులు, చింతల రాజేశ్, దత్తేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్