Tuesday, September 17, 2024
HomeTrending Newsటీఆర్ఎస్ అంతానికి ఆఖరి పోరాటం

టీఆర్ఎస్ అంతానికి ఆఖరి పోరాటం

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అంతానికి ఆఖరి పోరాటం ఆరంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో తాలిబన్ల, రజాకర్ల రాజ్యం నడుస్తోందన్నారు. తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా? ప్రజల సంక్షేమానికి పాటుపడే రామరాజ్యం కావాలా?…తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని చెప్పిన బండి సంజయ్ ప్రజల జోష్ చూస్తుంటే 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా సరే… తొలి సంతకం విద్య, వైద్యంపైనేనని ప్రకటించారు. రాష్ట్రంలో ఇక ఎవరూ బలిదానాలు చేసుకోవాల్సిన పని లేదని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టి ప్రజా స్వామిక తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు.

హిందూ సమాజానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. టీఆర్ఎస్ నాయకులు డిపాజిట్ కోసం పోరాడాల్సిందే అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బండి  సంజయ్  హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు తరువాత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించారు.

తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్ర్ముతి ఇరానీతో కలిసి బండి సంజయ్ హుస్నాబాద్ లో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు.  జనసంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో నలుదిక్కులా రోడ్లపైకి వేలాది మంది జనం తరలివచ్చారు. హుస్నాబాద్ రోడ్లన్నీ జన సంద్రమయ్యాయి.  వారందరికీ అభివాదం చేస్తూ పట్ణణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సభ వద్దకు వచ్చారు. వేలాది మంది జనంతో ఇసుక వేస్తే రాలనంతంగా అంబేద్కర్ సర్కిల్ నిండిపోయింది. ఈ సందర్భంగా జరిగిన సభలో స్మ్రుతి ఇరానీ, బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, సుద్దాల దేవయ్య, చంద్రశేఖర్, మాజీ ఎంపీ జి.వివేక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, సహ ప్రముఖ్ లు లంకల దీపక్ రెడ్డి, టి.వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న పలువురు బాధితులు సభకు తరలిరాగా…వారిని వేదికపైకి పిలిచి వారి తరుపున పోరాడేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించారు.  బండి సంజయ్ కుమార్ తోపాటు ఇతర నేతలు చేసిన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ :

గాంధీ జయంతి స్పూర్తితో అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. బీజేపీ నాయకత్వంలో టీఆర్ఎస్ అంతానికి ఇదే చివరి పోరాటం కావాలని ఉద్యమిస్తున్నాం. ఇదే చివరి పోరాటం కావాలి. ఇంకెవరూ బలిదానాలు చేయొద్దు. టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలి. తెలంగాణకు కేంద్రం 2.91 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ..ఏ ఊరు వెళ్లినా ఇండ్లు లేవనే చెబుతున్నరు. చీమలు, పాములు, పక్షులకు కూడా గూడు ఉంటుంది కానీ….నా తెలంగాణ ప్రజలకు ఉండటానికి ఇల్లు లేదని నా అక్కలు చెల్లెళ్లు ఏడుస్తున్నరు. వాళ్లకు నేను బ్రాండ్ అంబాసిడర్ ను.

ధరణి టీఆర్ఎస్ కు భరణిగా మారితే…పేదలకు దయ్యంలాగా మారింది. ఆంజనేయులు వంటి రైతులు వారు సొంత భూమి కూడా ధరణివల్ల పాస్ బుక్ రాకుండా ఇబ్బంది పెడుతున్నరు. లోన్లు రావు.  నానా కష్టాలు పడుతున్నరు. వీళ్లకు నేను బ్రాండ్ అంబాసిడర్ ను. చిన్న మల్లన్న, నర్సింహులు వంటి మిడ్ మానేరు భూ నిర్వాసితులు. వారికి ఏ  సాయం లేకుండా అల్లాడుతున్నరు. వారి తరపున పోరాడేందుకు నేను బ్రాండ్ అంబాసిడర్ ను.

ఈ పాదయాత్ర 36 రోజులు, 8 జిల్లాలు, 19 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో తిరిగిన. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నానా కష్టాలు పడుతున్నరు. నేను స్వయంగా పరిశీలించిన. చేవెళ్ల పోతే ప్రాణహిత నీళ్లు రాలే.. వికారాబాద్ పోతే నీళ్లు రాలేదు. సంగమేశ్వర నీళ్లు రాలేదన్నరు. మెదక్ పోతే 14 చెక్ డ్యాం లు పూర్తి కాలేదు. ఒక్క చుక్క నీరు కూడా రాలేద్నరు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. మాట్లాడితే ధనిక రాష్ట్రమని అంటున్నరు. నిజంగా ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదు? రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు. 22 వేల మంది స్వచ్ఛ కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వలంటీర్లను, స్టాఫ్ నర్సులను ఎందుకు తొలగించిండ్రు. వాళ్లు వచ్చి తమ బాధలు చెప్పుకుంటుంటే కన్నీళ్లు వస్తున్నయ్. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినం. ఈ గడీలను బద్దలు కొట్టి ప్రజా స్వామిక తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాదయాత్ర చేపట్టిన. ప్రజలు ఏడుస్తూ బాధలు చెబుతుంటే ఏడుపొస్తుంది. లేటు చేసి పొరపాటు చేసిన కోవిడ్ వల్ల. పాదయాత్ర ను ఆపేది లేదు. కొనసాగించి తీరుతాం. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు తరువాత మళ్లీ మలిదశ పాదయాత్ర ఆరంభిస్తాం.

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి ఓట్లు వేయడం ఖాయం. ఈటల రాజేందర్ గెలుపు  ఖాయం. నేను అభివ్రుద్ది గురించి మాట్లాడితే బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నరు. ఎస్. బరాబర్ ధర్మం కోసం పనిచేస్తాం. 80 శాతం హిందువుల కోసం పనిచేస్తం. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం స్పందించకుంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుండెమీద చేయి వేసుకుని ఆలోచించాలి. హిందుగాళ్లు..బొందుగాళ్లని కేసీఆర్ మాట్లాడితే టీఆర్ఎస్ ను ఇదే కరీంనగర్ జిల్లా బొంద పెట్టిన సంగతిని మర్చిపోవద్దు.

టీఆర్ఎస్ పాలనలో కనీసం గణేష్ ఉత్సవాలను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇతర పండుగలకు వస్తే గిఫ్ట్ లు పంపే టీఆర్ఎస్ ఫ్రభుత్వం హిందువులు పండుగలకు ఏమిచ్చారు? కనీసం తిండి లేక అల్లాడుతున్న వారి కోసం ఏం చేస్తున్నారు? వాళ్ల కోసం మాట్లాడవద్దా? ఎంఐఎం తాలిబన్ల రాజ్యం తెస్తానని అంటే….రజకార్ల రాజ్యం తెస్తానని టీఆర్ఎస్ అంటోంది. ఆడపిల్లలను చెరబట్టి రాక్షసంగా వ్యవహరించిన తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా? ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చే రామరాజ్యం కావాలా? హిందూ ధర్మం కోసం పోరాడకుంటే….మనల్ని బొందగాళ్లు చేస్తారు. అందుకే హిందూ ధర్మం కోసం బరాబర్ పోరాడతా. నాకు రబ్బర్ చెప్పుగాళ్లు, జీన్స్ ప్యాంట్ యువత కావాలి. వారి నోటి నుండి వచ్చే ఏకైక నినాదం భారతమాతాకీ జై అంటూ నినదిస్తున్నరు.

రామరాజ్యం కావాలా? తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా?…..బైంసాలో నా హిందువులపై దౌర్జన్యం చేశారు. ఇంకొకసారి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే బైంసా వెళ్లి సభ పెట్టి బీజేపీ సత్తా ఏందో చూపుతాం. తెలంగాణలో మత విద్వేషాలు సాగనీయ్యం. ఒక వర్గానికి కొమ్ముకాసే పార్టీని అడ్డుకుంటాం. త్యాగాల పార్టీ బీజేపీ. అనే విషయాన్ని కుహాన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాలి. హిందూ సమాజానికి, తెలంగాణ సమాజానికి న్యాయం జరగాలంటే….తెలంగాణలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి. అసెంబ్లీలో రాజాసింగ్ మాట్లాడతానంటే…మైక్ కట్ చేస్తున్నారు. రేపు మూడో వ్యక్తి రాజేందర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నరు. బీజేపీ సత్తా ఏందో చూపుతాం.

బీజేపీ ఏరోజు మీటింగ్ పెడితే కాంగ్రెస్ అదే రోజు సభ పెడుతున్నరు. అదేందో అర్ధం కావడం లేదు. కాంగ్రెస్ అసలు ఏ పార్టీకి వ్యతిరేకం. బీజేపీకా? టీఆర్ఎస్ కా? కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నయ్. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక విజయ యాత్ర పేరుతో ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టి తీరుతాం.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ :

హుజూరాబాద్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. కేసీఆర్ రాజ్యాంగమే అమలవుతోంది. 5 నెలలుగా ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నరు. మద్యం ఏరులై పారుతోంది. మనుషులకు విలువ కట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నేను గెలవొద్దు, నా ముఖం అసెంబ్లీలో కన్పించవద్దని కేసీఆర్ ఆదేశిస్తే…దానిని కేసీఆర్ బానిసలు అమలు చేస్తున్నరు. నేను 18 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన. కేసీఆర్ కాదు కదా…కేసీఆర్ తాత దిగొచ్చినా నా ఉద్యమ చరిత్రను చెరిపివేయలేరు.

ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ :

ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ కార్యక్రమం విజయవంతమైంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అన్ని కులాలు, మతాలుసహా పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలంతా ప్రజా సంగ్రామ యాత్ర వెంట నడిచారు. బీజేపీ నేతలు బీసీ గణన ఎందుకు చేయడం లేదని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలకు సిగ్గుంటే…సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు వెల్లడించడం లేదో ప్రజలు నిలదీయాలి. కేంద్ర మంత్రి చిదంబరం చేసిన తప్పిదంవల్ల ప్రస్తుతం బీసీ గణన ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం చెబితే …దాన్ని టీఆర్ఎస్ చిలువలు పలువులుగా చేసి దుష్ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ శిఖండి పార్టీ. ఆ పార్టీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి రాబోయే రోజుల్లో ప్రజాస్వామిక నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరుతున్నా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్