Sunday, January 19, 2025
HomeTrending NewsBJP: తెలంగాణకు కదిలిన కమలదళం

BJP: తెలంగాణకు కదిలిన కమలదళం

తెలంగాణలో ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. పార్టీలు ప్రచారం ఉదృతం చేశాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణపై అంతగా ఫోకస్ పెట్టని బిజెపి ఈ దఫా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజస్థాన్ ఎన్నికలు ముగియటంతో ఢిల్లీ కమల దళం మొత్తం తెలంగాణ చేరుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం సిఎం హేమంత బిశ్వశర్మ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో రెండు అంకెల సీట్లు దక్కించుకోవాలని పార్టీ వ్యూహ రచన చేస్తోంది. గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో  అగ్రనేతలతో బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తో బిజెపికి లోపాయికారి ఒప్పందం ఉందని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలు కొట్టిపారేసి బిజెపి అస్తిత్వం చాటాలని…బిజెపి తరపున బలమైన అభ్యర్థులు ఉన్నచోట పార్టీ ముఖ్యనేతలు రోడ్ షోలు, బహిరంగసభలతో అధికార పార్టీని ఎండగడుతున్నారు. సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాని ప్రచారానికి వెళ్ళటం గమనార్హం.

బిజెపి నేతల ప్రచారంలో అధికంగా కెసిఆర్ టార్గెట్ గానే విమర్శలు సంధిస్తున్నారు. దక్షిణ తెలంగాణతో పోలిస్తే పార్టీ పటిష్టంగా ఉన్న ఉత్తర తెలంగాణలో అగ్రనేతలను మొహరించారు. ముఖ్యంగా మూడు ఎంపి స్థానాలు గెలిచిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ప్రచారం కేంద్రీకరించారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు ఈ జిల్లాల్లో పార్టీ విజయం కోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, బోథ్, ముధోల్ నియోజకవర్గాల్లో బిజెపి బలపడుతోందని…విజయానికి అవకాశాలు ఉన్నాయని పార్టీ నిర్వహించిన సర్వేల్లో నివేదికలు వచ్చాయి. నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి, బోథ్ సోయం బాపురావు, ముధోల్ -రామారావు పటేల్ బరిలో ఉన్నారు. వీరి గెలుపు కోసం కీలక నేతలు నియోజకవర్గ స్థాయిలో మంత్రాంగం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాల్లో ఆర్మూర్, బాన్సువాడ, బాల్కొండ, కామారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలుపు కోసం కార్యాచరణ చేపట్టారు. ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్ రెడ్డి, బాన్సువాడ – ఎండల లక్ష్మి నారాయణ, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ, కామారెడ్డిలో వెంకటరమణ రెడ్డి, జుక్కల్ నుంచి అరుణ తార పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, జగిత్యాల స్థానాల్లో బిజెపి అభ్యర్థులు బలంగా ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్, హుజురాబాద్ లో ఈటెల రాజేందర్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, జగిత్యాలలో బోగ శ్రావణి పోటీ చేస్తున్నారు. నాలుగు స్థానాల్లో విజయావకాశాలు బలంగా ఉండటంతో పార్టీ నాయకత్వం ముఖ్యనేతలతో ప్రచారం నిర్వహిస్తోంది.

వీటితోపాటు మహబూబ్ నగర్, కల్వకుర్తి, సూర్యపేట, వరంగల్ తూర్పు, ముషీరాబాద్, గోషామహల్, సనత్ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, సంగారెడ్డి స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. ఆయా ప్రాంతాల్లో సమీకరణాలకు అనుగుణంగా జాతీయ స్థాయి నేతలను మొహరించారు. బిజెపి ప్రచారం ఉదృతం చేయటంతో గెలుపు ఓటములు తారుమారు అవుతున్నాయని విశ్లేషణ జరుగుతోంది.

కాంగ్రెసు గెలిస్తే మత కలహాలు చెలరేగుతాయని పుకార్లు మొదలయ్యాయి. దీంతో మైనారిటీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని వార్తలు వస్తున్నాయి. మొదట కాంగ్రెస్ కు అండగా ఉన్నారని వినిపించినా క్రమంగా వీరి ఆలోచనా ధోరణి మారుతోందని తెలిసింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాల పరిధిలో ఆ వర్గాలపై ట్రిపుల్ తలాక్ ప్రభావం ఉంటుందని.. ముఖ్యంగా మహిళల ఓట్లు కమలంకు దక్కుతాయని ఓ అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్