Sunday, September 29, 2024
HomeTrending Newsకూటమి భేటీ; సీట్ల మార్పుపై చర్చ!

కూటమి భేటీ; సీట్ల మార్పుపై చర్చ!

ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి-టిడిపి-జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. తన ఇంటికి వచ్చిన నేతలను చంద్రబాబు సాదరంగా స్వాగతించారు.

కూటమిలో మూడు పార్టీలు పోటీ చేస్తున్న సీట్లలో స్వల్ప మార్పులు చేసే అంశం నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అనపర్తి సీటును బిజెపికి కేటాయించగా శివరామకృష్ణంరాజును అభ్యర్ధిగా కూడా ప్రకటించింది.  స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డికి  శివరామ ధీటైన అభ్యర్ధి కాదని, టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని, ఈ సీటు విషయంలో పునరాలోచన చేయాలని టిడిపి కోరుతున్నట్లు సమాచారం. చివరి ఆప్షన్ గా నల్లమిల్లి భార్యను బిజేపినుంచి బరిలో దించేలా బాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు ఉండి స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజును పోటీ నుంచి తప్పించి ఆ స్థానంలో ఇటీవలే పార్టీలో చేరిన ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అభ్యర్ధిత్వాన్ని చంద్రబాబు నేడో రేపో ప్రకటించనున్నారు. దీనిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్