Friday, October 18, 2024
HomeTrending Newsవలస నేతలతో కమలం వికసించేనా..?

వలస నేతలతో కమలం వికసించేనా..?

తెలంగాణలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలో  అధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న బిజెపి స్వయంకృతపరాధంతో తిరోగమనంలో వెళుతున్నట్టుగా ఉంది.

నాయకత్వం ఎత్తుగడలతో కమలం శ్రేణులకు పాలుపోవటం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తుంటే రాష్ట్ర నేతలు మింగలేక కక్కలేక పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటున్నారు. తాజా జాబితా పరిశీలిస్తే అదే ద్యోతకం అవుతోంది.

బీజేపీ రెండో జాబితా
1.మెదక్ – రఘునందన్ రావు,
2.ఆదిలాబాద్ – నగేష్.
3.మహబూబాబాద్ – సీతారాం నాయక్.
4.నల్గొండ – సైదిరెడ్డి.
5.మహబూబ్ నగర్ – డీకే అరుణ.
6.పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్. ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు.

బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపి గోడం నగేష్ ను ఆదిలాబాద్ స్థానంలో నిలిపిన బిజెపి వ్యుహాత్మకంగానే వ్యవహరించిందని చెప్పవచ్చు. పార్టీ శ్రేణుల్లో నియోజకవర్గం అంతా పరిచయం ఉన్న నేత లేకపోవటం ఒక లోటుగా చెప్పుకోవచ్చు. మరో మాజీ ఎంపి రమేష్ రాథోడ్ యత్నించినా.. లంబాడ సామాజికవర్గం కావటంతో ఆయనకు దక్కలేదు. మహబూబాబాద్ లో సీతారాం నాయక్ ను పార్టీ అభ్యర్థిగా నిలిపారు. దీంతో రమేష్ రాథోడ్ కు మొండి చేయి తప్పలేదు.

దాంతోపాటు ఆదిలాబాద్ స్థానంలో ఆదివాసిల ప్రాబల్యం అధికం. ఆ వర్గాల వారికి ఇస్తేనే గెలుపు సాధ్యం. ఇటీవలి కాలంలో ఆదివాసీలు అభ్యర్థి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టికెట్ కోసం 42 మంది దరఖాస్తు చేసినా రేసులో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, సర్దార్ అభినవ్, శ్రీలేఖ, డా. సుమలత ఇతరులు ఉన్నారు. వీరందరినీ కాదని నగేష్ ను అదృష్టం వరించింది.

నల్గొండ టికెట్ సైదిరెడ్దికి ఇవ్వటంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు సంకినేని వెంకటేశ్వరరావు, భాగ్యరెడ్డిలు పార్టీ అగ్రనేతలతో విబేధిస్తున్నారట. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూముల వ్యవహారంలో పార్టీ నేతలను జైలు పాలు చేసినవారిని ఎలా చేరదీస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సైదిరెడ్దికి పార్టీ శ్రేణులు సహకరించక పోతే నిలదొక్కుకోవటం అంత తేలిక కాదు. నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అని పేరుంది. దానికి తోడు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిల చాణక్యం రఘువీర్ రెడ్డికి కలిసి వస్తుందని అంచనా.

మహబూబ్ నగర్ లో డీకే అరుణ సీనియర్ నాయకురాలిగా పేరున్నా ఎంపిగా గెలవటం అంత సులువు కాదనే అంచనా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి యువనేతగా మంచిపేరు, క్లీన్ చిట్ కలిసి వచ్చే అంశాలు. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ దీని పరిధిలో ఉండటం సానుకూల అంశం.

పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ కు బిజెపి క్యాడర్, మోడీ చరిష్మా మీద ఆధారపడాలి. మెదక్ లో రఘు నందన్ రావు కు ఇవ్వటం కలిసివచ్చే అంశమని విశ్లేషణ జరుగుతోంది. ప్రస్తుత తరుణంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కెసిఆర్ ను తప్పితే ప్రజలు అంగీకరించే అవకాశాలు లేవని ఇటీవల గులాబీ దళానికి అందిన నివేదికల్లో తేలిందట. దాంతో అక్కడ ఎవరిని బరిలో దించాలా అని మల్లగుల్లలు పడుతున్నారు.

మహబూబాబాద్ స్థానంలో ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థి బలరం నాయక్ గెలుపు ఖాయమని ఫ్లాష్ సర్వేల్లో వెల్లడైందట. ఈ స్థానంలో బిజెపి, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మలోత్ కవితకు ఈసారి భంగపాటు తప్పదని అంటున్నారు.

నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్ లో బిజెపి అభ్యర్థులు 2014లో గెలిచే వరకు… రాష్ట్ర స్థాయిలో అంత సుపరిచితులు కాదు. ప్రజలు పట్టం కట్టిన తర్వాతనే వారి పలుకుబడి పెరిగింది. ఈ దఫా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల నష్టం తప్పితే పార్టీకి మేలు జరగదని కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్