Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబిజెపి- టీఆర్ఎస్ వైరం

బిజెపి- టీఆర్ఎస్ వైరం

Festival to Media: ఇంగ్లీషులో పొలిటికల్ స్పేస్ అని ఒక ఒక వాడుక మాట. రాజకీయ అవకాశం లేదా రాజకీయంగా చోటు అనుకోవచ్చు. మీడియాలో యాడ్ స్పేస్ అని ఒక మాట వాడుకలో ఉంది. అంటే ప్రకటనలకు చోటు. రాజకీయ పార్టీలకు, నాయకులకు పొలిటికల్ స్పేస్ ఎంత ముఖ్యమో…మీడియాలో స్పేస్- చోటు కూడా అంతే ముఖ్యం.

పొలిటికల్ స్పేస్, మీడియా స్పేస్, యాడ్ స్పేస్ మాటలు బాగా అర్థం కావాలంటే…వారం రోజులుగా హైదరాబాద్ లో బి జె పి- టి ఆర్ ఎస్ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలను గమనిస్తే...అరటి పండు ఒలిచి పెట్టినట్లు సులభంగా తెలిసిపోతాయి.

Advertisements

తెలంగాణాలో బి జె పి – టి ఆర్ ఎస్ మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయికి చేరింది. అందుకే అదే పనిగా బి జె పి తన కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించింది. మామూలుగా అయితే ఆ సమావేశాలకు ఇంత ప్రాధాన్యం వచ్చేది కాదు. ముఖ్యమంత్రి కె సి ఆర్, టీ ఆర్ ఎస్ నాయకులకు బి జె పి మనసులో కృతఙ్ఞతలు చెప్పుకుని ఉంటుంది. టి ఆర్ ఎస్ వారి ప్రశ్నలు, హోర్డింగులు, ప్రకటనలు, ప్రెస్ మీట్లు, తిట్లు, శాపనార్థాలతో అవసరమయినదానికంటే ఎక్కువగా బి జె పి కి ప్రచారం వచ్చింది.

రెండు పార్టీలు పోటీలు పడి హోర్డింగులు, వాల్ పోస్టర్లు, గోడ రాతలు, పత్రికా ప్రకటనలు, రేడియో టీవీ ప్రకటనలు ఇవ్వడంతో ఆయా రంగాలవారు కాసుల గలగలలతో కళకళలాడారు. నెలకోసారి మోడీ- అమిత్ షా తెలంగాణకు రావాలని వీరందరూ కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.

ఇన్నిన్ని ప్రకటనలు ఎంత ప్రభావం చూపుతాయో కానీ…పత్రికలు తిప్పితే పేజీలకు పేజీలు తెలంగాణ ప్రభుత్వ, బి జె పి పార్టీ ప్రకటనలే. బి జె పి కి పత్రికల మొదటి పేజీల్లో అటు వార్తలకు, ఇటు ప్రకటనలకు చోటు దొరక్కుండా టి ఆర్ ఎస్ ప్రభుత్వం యాడ్స్ కుమ్మేసింది. రెండు పార్టీల వైరం మీడియాకు కాసుల పంట. లేకపోతే ఒక పట్టాన కే సి ఆర్ ప్రకటనలు ఇవ్వరు.

ప్రకటనల ప్రభావం ఎంత అన్నది ఇక్కడ అప్రస్తుతం. సామాజిక మాధ్యమాలు ఇంతగా విస్తరించి విడియోకాల్ లో న్యాయవిచారణలు, తీర్పులు; వర్చువల్ పౌరోహిత్యాలు కూడా జరుగుతుంటే రోజుల తరబడి రోడ్లను స్తంభింపజేసి, దారులు మళ్లించి, లక్షలాదిగా జనాన్ని తరలించి…బహిరంగసభలు జరపాలా అన్న ప్రశ్న రాజకీయ తర్కం ముందు నిలబడదు. రాజకీయం అంటేనే జన సమీకరణ. బల నిరూపణ. ఎంతగా జనాన్ని సమీకరిస్తే అంత గొప్ప. ఇసుకవేస్తే రాలనంతగా కిక్కిరిసిన జనాన్ని చూస్తే రాజకీయ నాయకుడికి వచ్చే కిక్కే వేరు. ఇందులో ఎవరికయినా సందేహాలుంటే పరేడ్ గ్రౌండ్ జనాన్ని చూసి పొంగిపోయిన ప్రధానిని చూడండి.

ఇంకా సందేహం మిగిలి ఉంటే ప్రశంసాపూర్వకంగా ప్రధాని చరిచిన బి జె పి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భుజాన్ని చూడండి. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల దాకా చూడబోయే ఎన్నెన్నో దృశ్యాల్లో బండి సంజయ్ భుజం తట్టుడు ఒకానొకటి. అభీ బహుత్ పిక్చర్స్ బాకీ హై!

కొసమెరుపు:-
మీడియా స్పేస్ పోటీలో వెనుకబడకూడదని కాంగ్రెస్ ఆలోచించి…అలోచించి…ఒక ప్రయోగం చేసిందట. వారం రోజులుగా మీడియా నిండా బి జె పి- టిఆర్ఎస్ వార్తలే ఉండడంతో…రేవంత్ రెడ్డి విహెచ్ మీద నిప్పులు కురిపించారట. జగ్గారెడ్డి రేవంత్ మీద కత్తులు దూశారట. దాంతో మీడియాలో తాము కోరుకున్న స్పేస్ వచ్చిందని స్వయంగా జగ్గారెడ్డే ఉబ్బి తబ్బిబ్బయి చెబుతున్నారు.

నాటక శాస్త్రాన్ని నిర్వచించిన ఆంధ్ర “దశరూపకం” పది రకాల ప్రదర్శనలు ఉంటాయని చెప్పింది. ప్రహసనం, సమవాకారం లాంటివి ఈ పది. జగ్గారెడ్డి నిర్వచించిన ఈ ప్రదర్శనను పదకొండోదిగా పేర్కొని “ఆంధ్ర ఏకాదశరూపకం” అని పేరు మారిస్తే సరి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

పెద్దవారి పిల్లలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్