Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెద్దవారి పిల్లలు

పెద్దవారి పిల్లలు

Dynasty Failures: మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరువాత దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు, ఉత్థాన పతనాలు, వ్యక్తి పూజలు, వారసుల వైఫల్యాల మీద చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా.

అఖిల భారత కాంగ్రెస్ ఒక బ్రహ్మ పదార్థం. దానిని అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు. గాలి ఎండిపోయేలా చేయలేదు. కత్తి కోయలేదు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ వరకు ఒకరి తరువాత ఒకరు వారసులుగా పార్టీని నిలబెట్టారు. రాజకీయాన్ని రాజకీయంగా నడపడంలో ఇందిర తండ్రిని మించిన తనయ. రాజీవ్ మెత్తన. మొహమాటాలు ఎక్కువ. దేశాన్ని మరో ప్రపంచం వైపు అడుగులయితే వేయించారు. ఆయన తరువాత కాంగ్రెస్ పడుతూ లేస్తూ…ఇప్పుడు తన పేరు తానే మరచిపోయి దిక్కులు చూస్తోంది.

 Dynasty Politics

రాజీవ్ వారసుడిగా రాహుల్ మంచివారు. ఆయనలో ఏదో లోపం. పార్టీని ఆయనే నడుపుతూ ఉంటారు. నడపనట్లు డిటాచ్ అవుతారు. ప్రియాంకను ఉత్తరప్రదేశ్ లో ప్రయోగిస్తే ఫలితం సున్నా. సీనియర్లు ఎవరికి కోవర్టులుగా పనిచేస్తున్నారో తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత. కాంగ్రెస్ కొమ్మ నుండే వేరయి…ప్రాంతీయ పార్టీలుగా ఒక వెలుగు వెలుగుతున్న పార్టీలను చూసి అసూయపడడం తప్ప ఏమీ చేయలేని నిర్వేదం.

కాంగ్రెస్ సెక్యులర్ ముద్ర వదులుకోలేదు. హిందూ వేషం వేసుకున్నా ఉపయోగం లేదు. తన డి ఎన్ ఏ ఏమిటో తనకే తెలియని అయోమయంలో ఉంది. రాహుల్ ఎప్పటికయినా ఈ దేశానికి ప్రధాని అవుతారు అని కాంగ్రెస్ వారి నమ్మకం. ఆ “ఎప్పటికయినా” ఎప్పుడు అన్నదే ఇప్పటి సంభావ్యతలను బట్టి ప్రశ్నార్థకం.

అదృష్టం కొద్దీ ప్రధాన మంత్రి అయిన దేవే గౌడకు కొడుకు కుమారస్వామి. ఆయన కూడా అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఒకసారి బి జె పి తో మరోసారి సెక్యులర్ పక్షాలతో ఏవో విన్యాసాలు కుమారస్వామి చేస్తూ ఉంటారు కానీ…కుటుంబ పార్టీ భవిష్యత్తు ఏమిటో అయోమయంగా ఉంది. కొడుకును ఎలాగయినా సినిమా హీరోను చేసి తీరాలన్న పట్టుదలలో వెయ్యో వంతు కూడా పార్టీని విస్తరించడం మీద కుమారస్వామి దృష్టి పెట్టలేరు. తరతరాలకు తరగని ఆస్తులు. జనం గెలిపిస్తే ఉంటాం…లేకపోతే జనంతో మాకేమి పని? అన్నట్లు కర్ణాటకను వదిలి బిందాస్ గా జాతీయ, అంతర్జాతీయ, గ్రహాంతర ఖగోళ రాజకీయాల్లో కుమారస్వామి నిశ్చలంగా ఉంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ సెక్యులర్ ఓట్లను చీల్చడానికి అవసరం కాబట్టి బి జె పి కూడా కుమారస్వామిని తొక్కేయదు. అలాగని ఎదగనివ్వదు.

ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఒక సంచలనం. సమాజ్ వాదీ పార్టీని నిర్మించి, నిర్వహించిన తీరు సామాన్యం కాదు. ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ సౌమ్యుడు. ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగారు. తరువాత రెండు సార్లు ఓడిపోయారు. గోరఖ్ పూర్ ఆశ్రమం స్వామి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు వేసుకుని లక్నో రోడ్లమీద హాయిగా తిరుగుతుంటే…మాయావతి బి ఎస్ పి నామమాత్రమైపోయింది. సమాజ్ వాదీ అఖిలేష్ మనుగడ ప్రశ్నార్థంగా ఉంది. జాతీయత, హిందూత్వకు దెబ్బ తగలకుండా ఒక పొలిటికల్  నేరేటివ్ ఎలా తీసుకోవాలో అఖిలేష్ కు అంతుబట్టడం లేదు.

బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ మరొక సంచలనం. అగ్రవర్ణాల నుండి అధికార పీఠాలను బి సి లోగిళ్ళకు మళ్లించడంలో, గ్రామీణ బిహారీ హిందీ యాస, వేషాలకు అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ కలిగించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే గడ్డి వాములు వెంటపడి జైలుపాలు చేస్తే…ఆయన కొడుకు తేజస్వీ యాదవ్ పార్టీని నడుపుతున్నారు. నితీష్ కుమార్ అనుభవం, మధ్యతరగతి మంచి మనిషి ఇమేజ్ ముందు తేజస్వీ యాదవ్ కు పొలిటికల్ స్పేస్ దొరకడం లేదు. ముగ్గురు ప్లేయర్లు ఉన్న చోట మొదటి స్థానంలో ఉన్న బలమయిన ప్లేయర్ ను బి జె పి వదిలేస్తుంది. రెండు, మూడో ప్లేయర్లలో ఎవరు ఎక్కువ బలవంతుడయితే ముందు వాడి పని పడుతుంది. ఆపై బలహీనుడిని కొడుతుంది. చివర మొదటి స్థానంలో ఉన్నవాడితో ముఖాముఖీ తలపడుతుంది. ఇదంతా పది, పదిహేనేళ్ల గేమ్ ప్లాన్. పక్కాగా అమలవుతూ ఉంటుంది. చేయి అందనంతగా ఎదిగే ప్రతిపక్షాల కొమ్మలను సి బి ఐ, ఈ డి, ఐ టీ కట్ చేస్తూ ఉంటాయి. ఇదొక అసంకల్పిత ప్రతీకార చర్య.

 Dynasty Politics

మహారాష్ట్రలో బాల్ ఠాక్రే అంటే ఒక వణుకు. ఒక విస్మయం. ఒక ఆరాధన. ఒక సంచలనం. ఒక కింగ్ మేకర్. ఆయన గీచిన గీత దాటాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది ఆయన కొడుకే చీలిక పార్టీ పెట్టుకున్నారు. అతివాద హిందూ లైన్ వదిలి…మరొక కొడుకు ఉద్దవ్ సెక్యులర్ లైన్ తీసుకుని కాంగ్రెస్, ఎన్ సి పి తో కలిశారు. ఫలితం అనుభవించారు. ఆయన కొడుకు ఆదిత్య. పార్టీకి మోడ్రన్ లుక్ ఇవ్వబోయి చేతులు, కాళ్లు కాల్చుకున్నారు. ఇప్పుడు శివసేన పార్టీయే చేజారిపోతోంది.

వారసుల వల్ల పార్టీలు మునిగిపోతున్నా…రక్త సంబంధాల తీపి, మైకం వల్ల ఆ మునకే సౌఖ్యమనే భావనలో ఇంకా ఇంకా మునిగిపోతూ ఉంటారు.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి: 

పదవి పోయె…పార్టీ కూడా పోయె…

Also Read :

కాలంతోపాటు మారాల్సిందే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్