Saturday, January 18, 2025
HomeTrending Newsహైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

Bosch Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ బాష్ (Bosch) హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్ లో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు తెలిపింది.
ఈరోజు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కే తారకరామారావు బాష్ కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మౌలిక వసతులతో పాటు మానవ వనరులు ఉన్నాయని తెలిపిన కేటీఆర్, కంపెనీ ప్రస్తుతం నిర్దేశించుకున్న మూడు వేల మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే దాటి మరింత విస్తరిస్తున్నదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సమావేశానంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కంపెనీ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన వార్తను పంచుకున్నారు. జర్మనీకి చెందిన అత్యంత ప్రముఖ కంపెనీ, మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోమ్ అప్లయెన్సెస్ వంటి రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన బాష్ హైదరాబాద్ లో తన గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సరిగ్గా వంద సంవత్సరాల కింద భాష్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడం యాదృచ్చికమని, ఇలాగే 25 సంవత్సరాల కింద ఐటీ రంగంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ, అనేక సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఇక్కడి వాతావరణ అనుకూల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడం గొప్ప విషయం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలను, ప్రగతిశీల పురోగతిని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఆకర్షణను తెలియజేస్తున్నదన్నారు.

కంపెనీ త్వరలోనే అధికారికంగా ఒక కార్యక్రమాన్ని ఈ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేయనుంది.
వివిధ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ సినియర్ ప్రతినిధి బృందం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సెంటర్ హెడ్ సుందర రామన్ , ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి రంజన్ తదితరులు మంత్రితో కలిసి వీడియో కాన్ఫరెన్స్, కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్