మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స పేరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలతో సమావేశమైన జగన్… నేతల అభిప్రాయాలను తీసుకొని బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ఈ స్థానానికి వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన వంశీకృష్ణ యాదవ్ ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ పై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత వంశీకృష్ణ విశాఖ తూర్పు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 30న పోలింగ్ జరగనుంది.
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 841 ఓట్లు విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఉన్నాయి. వీటిలో ప్రస్తుత సంఖ్యా బలం ప్రకారం వైసీపీకి 615; తెలుగుదేశం 215 ఓట్లు ఉండగా 11 ఖాళీలు ఉన్నాయి.