Saturday, June 29, 2024
HomeTrending Newsబిసిల సీట్లలో తండ్రీ కొడుకుల పోటీ: జగన్

బిసిల సీట్లలో తండ్రీ కొడుకుల పోటీ: జగన్

గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్తం చేశారు. మొత్తం 200 సీట్లలో 100 సీట్లు ఈ వర్గాలకు కేటాయించామన్నారు.  చేనేతరంగానికి తమ ప్రభుత్వం చేయూత ఇచ్చిందని ఆ సామాజిక వర్గం నుంచి ఇద్దరు మహిళలు మంగళగిరిలో లావణ్య, ఎమ్మిగనూరులో బుట్టా రేణుక కు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా చేనేత వర్గానికి  ఎంపిక చేశామన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో జరిగిన ముఖాముఖిలో జగన్ పాల్గొన్నారు.

బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో తాము బీసీలకే సీట్లు కేటాయిస్తే ఆ రెండుచోట్ల తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ పోటీ చేస్తున్నారని… రాజకీయంగా బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి మంగళగిరి దక్కించుకోవాలని చూస్తున్నారని… వారు డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం లావణ్యకు వేసి గెలిపించాలని కోరారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో  వారికే సీటు ఇవ్వాలని తాను భావించిన వెంటనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే పెద్ద మనసుతో అంగీకరించి సహకరించారని జగన్ ప్రశంసించారు.

ఎవరు అధికారంలోకి వస్తే నేతన్న నేస్తం అందుతుందో, వైయస్సార్ చేయూత వస్తుందో, సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోకే వస్తాయో  ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.  మంగళగిరిలో లక్షా 20 వేల ఇళ్ళు ఉంటే వాటిలో  లక్షా 8 వేల ఇళ్ళకు తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. బాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేసినట్లే చేనేతకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారని జగన్ పేర్కొన్నారు.  మంగళగిరిలో 54 వేల మందికి ఇళ్ళస్థలాలు ఇచ్చి నిర్మాణం మొదలు పెడితే… సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. పేదలకు జరిగే మంచిని రాజకీయాల కోసం ఆపేశారని, బాబు- లోకేష్ లు ప్రచారానికి వస్తే దీనిపై నిలదీయాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్