Sunday, September 8, 2024
HomeTrending Newsఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోన్న ఫిట్‌మెంట్, పీఆర్సీని రెండూ పక్కన పెట్టుకొని బేరీజు వేసుకొని చూడాలని సూచించారు.  ‘ హరీష్‌రావు ఒకవేళ మాపై విమర్శలు చేసి ఉంటే, ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి టీచర్లతో మాట్లాడాలి. మేము ఎంత ఇచ్చామన్నది తెలుస్తుంది. దాంతో వారేం ఇచ్చారో తెలుస్తుంది. రెండింటినీ బేరీజు వేసుకోమని చెప్పండి. అందుకే ఇక్కడకు వచ్చి, టీచర్లతో మాట్లాడాలి. అప్పుడే ఆయనకు వాస్తవాలు తెలుస్తాయి.’ అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు.

ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆయన ఒక మహాజ్ఞాని, యుగ పురుషుడు. అందుకే మమ్మల్ని దద్దమ్మలు అంటున్నాడు. మనిషి పెరిగాడు కానీ, బుర్ర ఎదగలేదు. వాయిస్‌ ఉంది కదా.. అని ఏదో మాట్లాడుతున్నాడు. ఈ మూడేళ్లలో మేమేం చేశామని అడుగుతున్నాడు. మరి మీరు కూడా అంతకు ముందు మీ ప్రభుత్వం 14 ఏళ్లు ఉంది కదా? నీకు కూడా మంత్రిగా పని చేశావు కదా? మరి ఈ మూడు జిల్లాలలో ఏం చేశావో, నీ మార్క్‌ ఏమిటో చెప్పండి” అని నిలదీశారు.  రాజకీయ పార్టీలు సమీక్ష నిర్వహించుకోవడం ఆనవాయితీ అని, తమ పార్టీ అధ్యక్షుడు కూడా సమీక్ష చేశారని, దానిపై రెండు పత్రికల్లో ఏదేదో రాశారని అసహనం వ్యక్తం చేశారు.

విశాఖలో గతంలో వచ్చిన కేంద్ర సంస్థలు కాకుండా, ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే, అది కచ్చితంగా వైయస్సార్‌ హయాంలోనేనని బొత్స స్పష్టం చేశారు. లా యూనివర్సిటీ, హెల్త్‌ సిటీ, విమ్స్, ఫార్మా సిటీ, సెజ్, గంగవరం పోర్టు, కొండ మీద ఐటీ పార్క్‌ అప్పుడే వచ్చాయని వివరించారు. రిషికొండ ఒక హరిత గెస్ట్‌ హౌస్ ఉందని అది దారుణంగా ఉండడంతో అక్కడ మరో గెస్ట్‌ హౌస్, ప్రభుత్వ కార్యాలయం, సీఎం అధికార నివాసం కడితే తప్పేమిటని ప్రశ్నించారు.

అమరావతి మహా పాదయాత్రపై బొత్స మరోసారి స్పందించారు. “రైతుల కండువా వేసుకుని ఎందుకా యాత్ర? ఏకంగా టీడీపీ కండువాలు వేసుకోవడం ఎందుకు? మీకు ఆ ధైర్యం లేదా? కానీ నాకు ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రలో పుట్టిన వ్యక్తిగా నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అభివృద్ది కోరుకుంటున్నాను. నేను అలా అంటే యాత్ర నిర్వహిస్తున్న ఒకరు నాపై విమర్శలు చేశారు. ఇప్పుడు చెబుతున్నాను. ఆయన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమస్యలపై నన్ను కలిశారు. కాదంటారా? చెప్పండి” అంటూ ఎదురు ప్రశ్నించారు.

Also Read : టిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స 

RELATED ARTICLES

Most Popular

న్యూస్