Cinema Tickets:
సినిమా టికెట్లు ఇష్టానుసారం రెట్లు పెంచి అమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడం ఎలా అవుతుందో చెప్పాలన్నారు. సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సామాన్యునికి సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశామన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని బొత్స నిలదీశారు. సినిమా టికెట్ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా బొత్స పై విధంగా ప్రతిస్పందించారు.
టికెట్ ధరలను తగ్గించడం ప్రేక్షకులను అవమానించడం ఎలా అవుతుందన్నారు, ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయంపై వారికి ఏదైనా సమస్య ఉంటే, కష్టం ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అంతే కానీ తమ ఇష్టం వచ్చినట్లు తాము చేసుకుంటామంటే ఎలా అన్నారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, సినిమా అనేది ప్రజల బలహీనత అని దానితో వ్యాపారం చేయడం తగదని బొత్స అన్నారు.
Also Read :ఆరేసుకోబోయి…పారేసుకోలేదు