వినోదం పేరిట ప్రజలను దోపిడీ చేస్తామంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటుంటే, వారి అభిమతానికి వ్యతిరేకంగా టిక్కెట్ రెట్లు పెంచుకుంటూ పొతే ప్రభుత్వాలు స్పందిస్తాయని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెట్టాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా అడిగారని, అందుకే ప్రభుత్వం దీనిపై అలోచిస్తోందని బొత్స చెప్పారు. పవన్ కళ్యాన్ వ్యాఖ్యలపై బొత్స స్పందించారు.
ప్రజాస్వామ్యంలో అదుపులో ఉండి మాట్లాడాలని, సంయమనం పాటించాలని, సన్నాసులు అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడడం సరికాదని బొత్స హితవు పలికారు. పరిశ్రమ తరఫు నుంచి ఏవైనా సమస్యలు, డిమాండ్లు ఉంటే అందరూ కలిసి కూర్చొని ప్రభుత్వానికి చెప్పాలని అంతే తప్ప అలంటి భాష మాట్లాడడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. ప్రజలందరికీ వినోదం అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని, జీఎస్టీ ఎవరూ ఎగ్గొట్టకుండా చూడడం కోసమే ఆన్ లైన్ విధానం తెస్తున్నామని చెప్పారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వలేదనే వారికి ఈ కోపమని బొత్స వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ విస్తరణ అనేది సిఎం విచాక్షణాదికారమని, అయన తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని బొత్స వెల్లడించారు.