ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చని.. కానీ మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. బీహార్ ను పాలిస్తానంటూ బయల్దేరిన ఆయనకు అక్కడి ప్రజలు ఏం సమాధానం చెప్పారో ఆలోచించుకోవాలన్నారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడారు. నిన్న ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్ విజయావకాశాలపై చేసిన వ్యాఖ్యలకు బొత్స స్పందించారు. ఎవడు పడితే వాడు వచ్చి ఏదో మాట్లాడితే .. దాన్ని కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజి లో వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పీకే ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదని.. లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీర్ఘకాలిక వ్యూహాలతో సంస్కరణలు తీసుకు వచ్చి అమలు చేసేవాడు లీడర్ అని… జగన్ ఆపనే చేస్తున్నారని పేర్కొన్నారు. పీకే చెప్పిన ప్రొవైడర్, మేనేజర్ తరహా పాలిటిక్స్ చేసేది చంద్రబాబు అని పేర్కొన్నారు. సిఎం జగన్ గత ఐదేళ్ల పాలనలో విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని.. ఒక లీడర్ గా భావి తరాలకు ఏమి కావాలో దానిపై దృష్టి సారించారని వివరించారు. పేదరికం, విద్య, వైద్యం రంగాల్లో ఐదేళ్ళక్రితం ఏపీ ఏ స్థితిలో ఉందో, ఇప్పుడు ఎక్కడ ఉండో చూడాలన్నారు.
ఆయన మాకు ఐదేళ్ళ పాటు సలహాలు ఇచ్చారని… ఆ తరువాత ఆయన సలహాలు చాలంటూ ఈసారి తాము దూరం పెట్టామన్నారు. పీకే మాట్లాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీతో ప్యాకేజ్ సెట్ అయి ఓకే అయితే ఇంద్రుడు, చంద్రుడు.. లేకపోతే కాదా అని బొత్స ప్రశ్నించారు.