Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

Celebrities Endorsing Brands : 

ఏదో ఒక విషయాన్ని ప్రకటించేవి ప్రకటనలు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా ప్రకటనలు చెప్పలేవు. అందుకే సెలెబ్రిటీలు చెబితే ఎంతో కొంత గుడ్లప్పగించి జనం చూస్తారని ప్రకటనల్లో వారిని వాడుకుంటూ ఉంటారు. ఆయా ప్రకటనల్లో నటించే లేదా జీవించే సెలెబ్రిటీలు ఆయా వస్తువులను నిజంగా వాడుతున్నారా? అన్నది లోకం అడగకూడని ప్రశ్న.

తెలుగు టీ వీ లు ఆన్ చేస్తే చాలు – యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ల్యాబ్ లో మైక్రోస్కోప్ లో చూసి సూక్ష్మాతి సూక్ష్మ మరకలను కూడా కడిగి పారేసే ఘడి డిటర్జెంట్ సోపు గుణ గణాలను చెబుతూ ఉంటాడు. అందులో నాగార్జున బట్టలు ఘడి సోపు వల్లే మెరవాలని నియమమేమీ లేదు.సాయి సూర్య డెవెలపర్స్ వారు ఊరవతల వేసిన లే అవుట్లలో సైట్లు కొనుక్కోమని చెప్పే ప్రిన్స్ మహేష్ బాబు అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడా? లేక భవిష్యత్తులో అక్కడ తన కలల కుటీరం కట్టుంటాడా? అని అడగగలమా?

విరాట్ కోహ్లీ లోటాలకు లోటాలు బూస్ట్ లొట్టలేసుకుని తాగితేనే బ్యాట్ తో బంతిని బాదగలుగుతున్నాడా?

మనం మన హీరోల కష్టాన్ని సరిగ్గా గుర్తించట్లేదు కానీ- రోడ్డు మీద పది రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ బాటిల్ కొని తాగే మెళకువ, కామన్ సెన్స్ కరువై…ఈజిప్టు దాకా వెళ్లి, ఆ ఎడారిలో గొంతు తడారి, పిరమిడ్ మీది నుండి హాట్ బెలూన్ మీదపడి, ఎవడో దొంగ చేతిలో నుండి బాటిల్ లాక్కుని తాగుతుంటే మన గుండె తరుక్కుపోతుంది. ఒక కూల్ డ్రింక్ తాగడానికి ఇలా ప్రాణాన్ని పణంగా పెట్టాలా? లేక కూల్ డ్రింక్ ఇలాగే తాగాలా?

Celebrity Endorsements :

ఒక రోజు టీ వీ ల్లో వచ్చే ప్రకటనలు చూశాక సాధారణ ప్రేక్షకులకు కలిగిన అవగాహన ఇది:-

కరీనాకు చుండ్రు సమస్య. కత్రినాకు డ్రై హెయిర్ ప్రాబ్లమ్. శిల్పాకు జుట్టు రాలే సమస్య.

మీ ఇంట్లో ఆడవాళ్లు ఉంటే…మీ పొరుగింట్లో వాడు డియోడరెంట్ వాడకుండా మీరే జాగ్రత్త పడాలి.

మీ చదువు సంస్కారాలకంటే- మీ శరీరం రంగు చాలా ప్రధానం.

మీ వంటింట్లో ఉప్పు అయిపోతే కంగారు పడకండి. చిటికెడో, కడివెడో టూత్ పేస్ట్ వేసుకోండి. ఓరల్ కేర్ కోసం డెంటిస్టులచే సిఫారసు చేయబడినది.

మగవారు పెర్ఫ్యూమ్ లు ఆడవారిని ఆకర్షించడానికే వాడుతుంటారు.

షాంపూ ప్రకటనల గ్రాఫిక్స్- అవతార్ సినిమా గ్రాఫిక్స్ కన్నా నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

పళ్ల రసాల్లోకంటే- షాంపూల్లోనే ఎక్కువ పళ్ల రసం ఉంటుంది.

అమూల్ పాల కంటే- అమూల్ కార్టూన్లు అందంగా, ఆరోగ్యంగా, భావగర్భితంగా ఉంటాయి.

భారతదేశంలో బైకులు కొనే అబ్బాయిలందరూ, అమ్మాయిలను వెంటేసుకుని తిరగడానికే కొంటుంటారు.

మొహమంతా పులుముకోకుండా డైరీ మిల్క్ చాకొలేట్ ను తినకూడదు.

బకార్డి సంగీతం సి డీ లు చేసి అమ్ముకుంటూ ఉంటుంది. డైరెక్టర్ స్పెషల్, కింగ్ ఫిషర్ మినరల్ వాటర్ అమ్ముకుంటూ ఉంటాయి.

భారత దేశంలో తల్లీ కూతుళ్లు మాట్లాడుకునే ఒకే ఒక అంశం- జుట్టుకు పూసుకునే నూనె.

ఎవరయినా ల్యాబ్ లో వైట్ కోట్ వేసుకుంటే శాస్త్ర జ్ఞానం తన్నుకుని వస్తుంది.

Celebrity Endorsements :

కొసమెరుపులు:-
ఈ చిత్రీకరణలో ఎక్కడా జంతువులను వాడలేదు. వాడినా గాయపరచలేదు.
అనుభవజ్ఞులయిన నిపుణుల పర్యవేక్షణలో చేసినవి. ఎవరూ అనుకరించకండి.
సృజనాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక సంచిత విచలిత విస్మిత ప్రారబ్ధ ఖర్మ ప్రతిబింబిత దృశ్యీకరణ.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: కలుపు మొక్కలు, చిప్ప కాఫీల వికటనలు!

Read More: ప్రకటన ఎలా ఉండకూడదో చెప్పే ప్రకటన!

RELATED ARTICLES

Most Popular

న్యూస్