Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రవీణ్ కొత్త ప్రయాణం

ప్రవీణ్ కొత్త ప్రయాణం

IPS Officer RS Praveen Kumar Quits From Service For Passion Towards Social Justice and Equality  :

Praveen Kumar: “I am inferior to none” & “I shall never give up”

నన్నొక దళిత వర్గ ఐ పి ఎస్ అనడంలో కుట్ర వుంది.
కమ్మవర్గ ఐ పి ఎస్ ,
రెడ్డి వర్గ ఐపిఎస్
వెలమ వర్గ ఐపి ఎస్ అంటారా?
ఇండియాకి ఒకటే ఐపి ఎస్ వుంటుంది.
నేను ఈ దేశానికి ఐపిఎస్ ని.
ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ ఆవేశం ఇది.

ఆయన రాజీనామా ఎందుకు చేసారు?
చేసాక ఏం చేస్తారు?
ఏ పార్టీలో చేరుతారు?
అనే అంశాల్లోకి వెళ్లే ముందు దళిత ఐ పిఎస్ అనడంలో నిజంగా కుట్ర వుందా?
మీడియా ఈ బిరుదు ఆయనకి ఎందుకు ఇచ్చింది? అనేది చూడాలి.

ఈవార్త చాలా ఇంసార్టెంట్.
బాగా రావాలి.
బాటమ్ అంతా వేసేయాలి.
ఏబికె గారి హడావిడి ఇంకా గుర్తుంది.
పాతికేళ్ల క్రితం ముచ్చట ఇది.
అయ్యేఎస్ జయప్రకాష్ నారాయణ వి ఆర్ ఎస్ వార్త అది.
ఆ ఒక్కరోజే కాదు..
చాలా రోజుల పాటు పత్రికల్లో జెపి పేరు మార్మోగింది.
అయ్యేయెస్ గా ఆయన సేవలు పేజీల కొద్దీ పరుచుకున్నాయి.

మొన్నా మధ్య ఐ పి ఎస్ జెడి లక్ష్మీనారాయణ వంతొచ్చింది.
ఆయన కూడా వి ఆర్ ఎస్ తీసుకున్నారు.
జెడి నాటికి మీడియా మరింత విస్తరించింది
జెపి రోజుల్లో పత్రికలొక్కటే మీడియా.
జెడి కి పత్రికలతో పాటు, టీవీలు, సోషల్ మీడియాలు తోడయ్యాయి.
ఆయన కేసులు, వాటిలో సెలెబ్రిటీలు.. అందులో రాజకీయాలు..
అబ్బో రాసుకున్నోడికి రాసుకున్నంత..
దాంతో ఆయన ఘన చరిత్ర గురించి కూడా మీడియా కోడై కూసింది.

ఇప్పడు ప్రవీణ్ కుమార్ సంగతి చూడండి..
ఆయన రాజీనామాకి వచ్చిన మీడియా కవరేజి చూడండి.
మీడియాకు కులం వుందో లేదో ఎవరూ చెప్పక్కర్లేదు.
కేవలం దళిత ఐపి ఎస్ గా ముద్ర వేయడంలో కుట్రని ఎవరూ వివరించక్కర్లేదు.
అలాగని రాయడానికి ఏమీ లేని అనామకుడేం కాదు..
చెప్పుకోడానికి ఏమీ లేని చేతకానివాడేం కాదు..
ఎవరెస్ట్ మీద అంబేడ్కర్ చిత్రపటాన్ని వుంచిన మలావత్ పూర్ణని అడగండి.
ప్రవీణ్ కుమార్ ఏం చేసారో చెప్తుంది.
దశతిరిగిన ఏగురుకులాన్నడిగినా చెప్తుంది..
ప్రవీణ్ కుమార్ సేవలేంటో…

పోలీస్ ఆఫీసర్ గా ప్రవీణ్ వేరు..
గురుకుల విద్యాసంస్థల సెక్రటరీగా ప్రవీణ్ కుమార్ వేరు..
మొదటి ఉద్యోగంలో ఆయన ప్రభుత్వానికి కావల్సిందేచేసారు.
రెండో బాధ్యతను తన ఆత్మతృప్తి మేరకు నిర్వర్తించారు..
నక్సలైట్లను అణిచేయడం..
ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమాన్ని డీల్ చేయడం..
ఇవన్నీ సర్కారీ పనులు..
దీంతో గురుకుల విద్యాసంస్థలని తీర్చిదిద్దడాన్ని పోల్చలేం.
ఈపనిలో ఆయన మనసుంది.
ఈ బాధ్యతలో ఆయన తనను తాను చూసుకున్నాడు.

తానెక్కడినుంచి వచ్చాడో.. ఎన్ని బాధలు పడ్డాడో..
ఇదే సాంఘిక సంక్షేమ హాస్టల్లో తన విద్యార్థి జీవితం ఎలా గడిచిందో గుర్తు
చేసుకున్నాడు.
అలాంటి పరిస్థితి తానుండగా ఈ పిల్లలకి రాకూడదనుకున్నాడు.
అందుకే ఒక ప్రభుత్వ అధికారిగా ఏం చేయగలడో అన్నీ చేసాడు.
అభివృద్ధిలో కూడా అప్పుడప్పుడూ ఎన్నికల ప్రయోజనాలుంటాయి.
అందుకే మంచి అధికారులను కూడా ప్రభుత్వాలు అప్పుడప్పుడూ ప్రోత్సహిస్తాయి.
ప్రవీణ్ కుమార్ కి కూడా ప్రభుత్వం కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది.

రాజకీయంగా ఎన్ని వత్తిడులు వచ్చినా..
పనిచేయడం మర్చిపోయిన టీచర్ల సంఘాలు ఎన్నిపేచీలుపెట్టినా..
స్వేరోస్ ని మతవివాదాల్లోకి లాగినా…
ప్రవీణ్ కుమార్ కు కేసిఆర్ ప్రభుత్వం అండగా నిల్చుంది.
ఒక అధికారికి ప్రభుత్వం ఇంతగా అండగా నిలవడం అసాధారణమే.
అందుకే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ మూడో పాత్ర మీద అనుమానాలు వస్తున్నాయి.

వి ఆర్ ఎస్ తర్వాత ఆయన నేరుగా టీఆర్ ఎస్ లోకే అంటున్నారు.
హుజూరాబాద్ లో ఈటల మీదకే ఈ తూటా ప్రయోగం అంటున్నారు.
దళిత ఓట్లను చీల్చడానికే అని మళ్ళీ ఆయన పాత్ర కుదిస్తున్నారు.
నిజంగా దళిత ఓట్లను చీల్చడానికే అనుకున్నా..
ప్రవీణ్ కుమార్ టీ ఆర్ ఎస్ లో చేరక్కర్లేదు.
టీఆర్ ఎస్ బయట వుంటేనే ప్రతిపక్ష వోట్లను చీల్చగలుగుతారు.
పైగా టీఆర్ ఎస్ లో చేరితే ఇంత కాలం ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు బలం ఇచ్చినట్టు అవుతుంది.
ఈ మాత్రం ఆలోచన ఇటు కేసి ఆర్ , అటు ప్రవీణ్ కుమార్ చేయకుండా వుండరు.

నేను ఎవరికంటే తక్కువ కాదు..
నేను ఎక్కడ వున్నా నాయకుడిగా వుంటాను..
స్వేరోస్ టెన్ కమాండమెంట్స్ లో మొదటి రెండూ ఇవే.
వీటిని ప్రవీణ్ కుమార్ తూచ తప్పకుండా ఆచరిస్తారో లేదో చూడాలి.
ఆచరిస్తే.. ఆయన టీ ఆర్ ఎస్ లోనో , మరో పార్టీలోనో చేరాల్సిన అవసరంలేదు.

ఇప్పటికే తనొక సైన్యాన్ని నిర్మించుకున్నాడు.
ఆ సైన్యానికి ఇప్పుడు తాను పూర్తిస్థాయి దళపతిగా మారొచ్చు.
కాకపోతే, ప్రభుత్వంలో వుండి పని చేయడం వేరు
బయటికొచ్చి రాజకీయాలు చేయడం., సమాజసేవ చేడం వేరు.
ఇప్పటి వరకు అలా వచ్చిన వాళ్లు పెద్దగా సక్సెస్ కాలేదనే చరిత్ర చెబుతోంది.
జెపి, విజయరామారావు, జెడి లక్ష్మినారాయణ, దినేష్ రెడ్డి, వీళ్ళంతా రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలు చేరనట్టే లెక్క.

కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు..కొందరు మంత్రులు కావచ్చు..
మరికొందరు ఏమీ కాకుండా పోవచ్చు
ఏమైనా కాకపోయినా.. ప్రజాదరణ మాత్రం ఆశించినంత పొందలేదు.
ఐ షల్ నెవర్ గివ్ అప్..
నేను అనుకున్న దాన్నిసాధించకుండా వదిలిపెట్టను.
ఇది ప్రవీణ్ కుమార్ చెప్పే పదో కమాండ్ మెంట్..
మరి దీన్ని ఆయన మనసావాచా నమ్మితే..
తాను అనుకున్న లక్ష్యాన్ని చేరొచ్చు.
బెస్టాఫ్ లక్.. ప్రవీణ్ కుమార్..

-కె. శివప్రసాద్

Read More: సమాధానం వెతికిన ప్రశ్న

Read More: ప్రజలు గెలిచేదెప్పుడు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్