Thursday, April 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజలు గెలిచేదెప్పుడు?

ప్రజలు గెలిచేదెప్పుడు?

Does India Have A Leader To Beat Modi In PM Race  : 

ఎవరో ఒకరు..
ఎప్పుడో అపుడు
ముందుకు కదలాల్సిందే..
అటో.. ఇటో..
ఎటోవైపు
దారి చూపాల్సిందే..

నిజమే..
మోడీ సర్వశక్తి సంపన్నుడు..
మోడీ సకలవ్యూహపారంగతుడు..
మోడీ సకలజనసమ్మోహనుడు..
గజకర్ణ గోకర్ణాదుల్లో చేయితిరిగినవాడు..
మరి మోడీ పాలనలో వైఫల్యాలే లేవా?
మోడీమార్క్ పాలిటిక్స్ లో అరాచకాల జాడే లేదా?
నానాటికి జనంలో పెరుగుతున్న అసంతృప్తి నిజం కాదా?
ఏం జరిగినా.. ఎంతమంది వద్దనుకున్నా..
ఈ దేశానికి మోడీ నుంచి విరుగుడే వుండదా..
ఇంతోటి ప్రజాస్వామ్యం..ఇంకో ప్రత్యామ్నాయాన్ని సాధించలేదా?
పాలకుడు ఎంత శక్తి వంతుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలి కదా…
కనీసం గెలుస్తామనే ఆశ అయినా వుండాలి కదా..
ఆ ఆశను నిలబట్టే ఆసరా కావాలి కదా.

Need a victory for people :

నిజమే..
ప్రజాస్వామ్యం అంటే..
ప్రజలకోసం. ప్రజల చేత.. ప్రజలే ఎన్నుకోవాలి..
కానీ.. ఏ ప్రజలు..
ఎంత శాతం ప్రజలు..
ఏ వర్గం ప్రజలు..
32శాతం ప్రజలే 303 సీట్లు ఇచ్చారు..
దేశాన్ని ఏలే తిరుగులేని అధికారాన్ని దారాదత్తం చేసారు.
మరి మిగిలిన 68శాతం ప్రజలు సంగతేంటి..
ఆ ప్రజలకు ప్రజాస్వామ్యంలో భాగం లేదా..
మోడీయే కావాలనుకున్నది మూడొవంతు ప్రజలే కదా…
మరి వద్దనుకునే మూడొంతుల మంది అభిప్రాయం మాటేంటి..
ఏడేళ్ల పాలన తర్వాత వద్దునుకునేవారి శాతం మరింత పెరిగింది.
మరో మూడేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల నాటికి ఇంకా పెరుగుతుంది.
ఇప్పుడు.. ఈ వ్యతిరేకతకి ఒక గొంతు కావాలి.
ఈ అసమ్మతికి ఉమ్మడి రూపం కావాలి.
స్థిరపడుతున్న అభిప్రాయాన్ని ..వోట్లు , సీట్లుగా మార్చే శక్తికావాలి.
ఆ శక్తి రాహూల్ గాంధీకి వుందా..?
రాహూల్ కే తన శక్తి మీద నమ్మకం వున్నట్టు కనపడదు.
ఆ గొంతు కాంగ్రెస్ కాగలదా..
అసలు కాంగ్రెస్ లోనే ఇప్పుడు అనేక గొంతులున్నాయి.
మోడీ వద్దు..కాంగ్రెస్ తో కాదు.. మరి మూడో ప్రత్యామ్నాయం ఏంటి..

నిజమే..
దేశంలో మూడో కూటమి ఎప్పుడూ విఫలప్రయోగమే…
అధికారం కోసమే కలిసిన పార్టీలు.. ప్రభుత్వాలుగా కుప్పకూలాయి..
కలగూరగంప ఫ్రంటులన్నీ..మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోయాయి.
అందుకని మరో ప్రయోగమే జరగకూడదా.
ఆ ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేయకూడదా..
కావచ్చు..
ప్రశాంత్ కిషోర్ కేవలం ఒక కార్పొరేట్ కన్సెల్టన్సీ కావచ్చు..
ఎన్నికల వోట్లు,వ్యూహాలు తప్ప..
ప్రజాశ్రేయస్సుతో అతనికేం పూచీ లేకపోవచ్చు..
కోట్లు తీసుకోవడం.. సీట్లు సంపాదించడం తప్ప
ప్రజాస్వామ్యంతో అతనికి వేరే సంబంధం లేకపోవచ్చు..

కానీ..
ఇవాళ విద్యాసంస్థల్ని విద్యావేత్తలు నిర్వహించడంలేదు..
ఆస్పత్రులు వైద్యుల చేతుల్లో లేవు.
మీడియా సంస్థలకు ఎక్కడో కానీ..జర్నలిస్టులు యజమానులుగా లేరు.
మనకి నచ్చకపోయినా..మనం కాదనలేని ప్రపంచం ఇది..
మనం ఒప్పుకోకపోయినా..జనం ఆదరిస్తున్న ధోరణి ఇది.
రాజకీయాల్ని కూడా ఈ రొచ్చులోకి మొదట లాగింది మోడీనే.
ఎలక్షనీరింగ్ ని ఒక కార్పొరేట్ ఎఫెయిర్ గా మార్చింది.. మోడీనే.
మరి ఆ మోడీని దించేందుకు అదే కార్పొరేట్ కన్సెల్టన్సీ ప్రయత్నిస్తే తప్పేంటి….
ప్రత్యర్థి బలవంతుడు కాబట్టీ యుద్ధమే వద్దంటే ఎలా..?
బలవంతమైన సర్పంపై చలిచీమల విజయం..
శతకాలకే పరిమితమంటే ఎలా?

జరగనీ..
సమానమో, అసమానమో.. యుద్ధమంటూ జరగనీ..
చీమలో..దోమలో .. శాయశక్తులా పోరాడనీ..
పాము ప్రాణాల సంగతెలావున్నా..
కనీసం కోరల్లో విషాన్నయినా హరించనీ..
ఓడించలేకపోయినా..
కనీసం నియంతను నేలకైనా దించనీ..
జనం గొంతును కొంతైనా వినపడనీ..
జనం ఆశలకి ఎంతోకొంత విలువ తేనీ..

-కే.శివప్రసాద్

Also Read:

కమల హ్యారిస్ కు థ్యాంక్స్: మోడీ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్