Friday, July 5, 2024
HomeTrending Newsబీఆర్ఎస్ ఎంపి అభ్యర్థులపై శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థులపై శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థుల ఎంపికపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్, చేవెళ్ళ – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ – కడియం కావ్య పేర్లను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన కెసిఆర్ తాజాగా ఆదిలాబాద్, మల్కజగిరి స్థానాలకు ఎంపి అభ్యర్థులుగా ఆత్రం సక్కు, రాగిడి లక్ష్మారెడ్డి పేర్లను ఖరారు చేశారు.

ఆదిలాబాద్ కు బిజెపి అభ్యర్థిగా గోడెం నగేష్ పేరు ప్రకటించారు. దీంతో బిజెపి, బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదివాసి సామాజిక వర్గం వారే కావటం గమనార్హం. కాంగ్రెస్ ఎవరికీ ఇస్తుందనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. లంబాడ సామాజిక వర్గం నుంచి పలువురు ప్రయత్నిస్తున్నా ఎవరిని ఖరారు చేస్తారనేది ఉత్కంట రేపుతోంది.

మల్కజగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మా రెడ్డి పేరు ఖారారు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాగిడికి ఇచ్చినా పార్టీ ద్వితీయ శ్రేణి ఎంతవరకు సహకరిస్తుందో వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ క్యాడర్లో నైరాశ్యం అలుముకుంది. మల్కజగిరికి శంబీపూర్ రాజు పేరు పరిశీలించినపుడే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు నిర్వేదంగా మాట్లాడుకుంటున్నారు.

నిజామాబాద్ ఎంపి అభ్యర్థిగా అనూహ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రకటించటం నేతలను విస్మయ పరిచింది. దీని పరిధిలో బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. బాజిరెడ్డికి నాలుగు నియోజకవర్గాలు మినహా మరెక్కడా పార్టీ శ్రేణులతో కూడా అంతగా పరిచయం లేదని, కేవలం సామాజికవర్గాల లెక్కలతో టికెట్లు ఇస్తే గెలుపు ఎలా సాధ్యమని నేతలు ప్రశ్నిస్తున్నారు.

చేవెళ్ళ ఎంపి టికెట్ కాసాని జ్ఞానేశ్వర్ కు ఇవ్వటం మరో విశేషం అనే చెప్పాలి. మొదట రంజిత్ రెడ్డి పేరు ప్రకటించటం, ఆ తర్వాత కాసాని పేరు తెరమీదకు రావటం శ్రేణుల్ని గందరగోళ పరిచింది. బిజెపి అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి పేరు ఖరారు అయింది. కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో బిసి కార్డు, ముదిరాజ్ ఓట్లను కొల్లగొట్టేందుకు కాసానిని రంగంలోకి దింపినా ఫలితం దక్కుతుందా అని పార్టీలో విశ్లేషణ జరుగుతోంది.

వరంగల్ టికెట్ ప్రహాసనంగా మారి చివరకు కడియం కావ్యకు కట్టబెట్టారు. ఆరూరి రమేష్ పై అనుమానంతోనే కావ్యకు ఇవ్వటం కొంత మేలు చేసిందని చెప్పవచ్చు. ఆరూరి రమేష్ కు బిజెపి టికెట్ ఖరారు అయిందని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉంటారు అనే అంశంపై బీఆర్ఎస్ గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయని ఒక అంచనా.

ఇప్పటి వరకు పార్టీ తరపున 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. అందులో గెలిచే అవకాశం ఉన్నవి అత్యల్పంగా కనిపిస్తున్నాయని గులాబీ నేతలే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పార్టీలో సమన్వయము కొరవడిందని, కేటిఆర్, హరీష్ రావులు సమీక్షలు చేస్తే కెసిఆర్ టికెట్లు ప్రకటిస్తున్నారని కార్యకర్తల అభిప్రాయాలకు స్థానం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్