Friday, September 20, 2024
HomeTrending Newsగులాబీ జెండానే తెలంగాణకు రక్షణ - కెసిఆర్

గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ – కెసిఆర్

లోక్ సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి ఎన్నికల శంఖారావం పూరించింది. కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన కదన భేరి బహిరంగసభలో పార్టీ అధినేత కెసిఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై కెసిఆర్ విరుచుకుపడ్డారు.

కరీంనగర్ కదన భేరి సభలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్

తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలైన పరిస్థితుల్లో తెలంగాణ కోసం జలదృశ్యంలో పార్టీ స్థాపించాను. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం. మే 17 వ తేదీ 2001 లో కరీంనగర్ నుండి సింహ గర్జన సభ జరుపుకున్నాము.

కరీంనగర్ నుండే తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అయింది. కేంద్రమంత్రి పదవిని,ఎంపీ పదవిని వదులుకోని కరీంనగర్ నుండి ఉప ఎన్నికల్లో గెలిచాను. కరీంనగర్ తెలంగాణకు అడ్డా.

కాంగ్రెస్ పార్టీ తులం బంగారం,ఆరు గ్యారెంటీలు అని చెప్పింది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని రాష్ట్ర మంత్రి చెప్పారు. రైతులు రైతు బంధు,కరెంటు అడిగితే ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా,మానవ బాంబు అవుతా అని అంటున్నారు

సీఎం పదవిలో ఉండి మానవబాంబు అవుతా అని మాట్లాడుతారా.
పేగులు మేడలో వేసుకుంటా అంటారా.
ముఖాన పెండ వేసుకుంటా అంటారా
మానవ బాంబులా, మన్ను బాంబులా
నేను తెలంగాణ ఉద్యమంలో మాట్లాడింది తెలంగాణ ద్రోహుల మీద, నేను సీఎం అయ్యాక దురుసు మాటలు మాట్లాడలేదు. తెలంగాణ వచ్చాక లంకె బిందెలు కోసం వచ్చామని నేను అన్నానా. ఎవరైనా సీఎం లంకె బిందెలు కోసం వచ్చామని అంటారా. మాతో పోటీ పడి పరిపాలన చెయ్యి.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు ఈర్ష్య లేదు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పా. మిషన్ భగీరథ నడిపే సత్తా ముఖ్యమంత్రికి లేదా.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరు. ఇప్పుడు బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో అవసరం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బిఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ బాగుపడుతుంది.

ఒక్క నవోదయ,ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు
ఎందుకు ఓటు వెయ్యాలి. బండి సంజయ్ కు…వినోద్ కుమార్ కు పోలిక వుందా.

కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఎకరం పొలం అయినా ఎండిందా…? దేశంలోనే మొదటి సారి రైతుబంధు తెలంగాణలో అమలు చేశాము. కేసీఆర్ సిఎంగా వున్నప్పుడు పచ్చని పొలాలు,24 గంటల కరంటు ఇప్పుడు ఏమైంది. కాంగ్రెస్ చెప్పిన బోనస్ బోగస్ అయింది.

కాళేశ్వరం ఎందుకు కట్టామో ప్రజలకు చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం బద్దలైనట్లు,ప్రపంచం కొట్టుకపోయినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను బద్నాం
చేయడమే లక్ష్యంగా సిఎం మాట్లాడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 300 పైగా పిల్లర్లు వుంటాయి. రెండు పిల్లర్లు కుంగితే భారతదేశం కొట్టుకపోయినట్లు బద్నాం చేస్తున్నారు. త్వరలో టీవీల ముందు కూర్చుని కాళేశ్వరంపై ప్రజలకు చెప్తా.

ప్రభుత్వంపై అంకుశం లాగా బిఆర్ఎస్ పార్టీ పని చేయాలి. డిసెంబర్ 9 వ తేదీన రుణమాఫీ హామీ ఎటు పోయింది. తెలంగాణ బలంగా ఉండాలంటే బిఆర్ఎస్ బలంగా వుండాలి. బతుకమ్మ చీరలు తమాషా కోసం తేలేదు.

చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు తెచ్చాము. తెలంగాణ ఉద్యమంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి ఏడ్చాము. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి.

ఓటు తమాషాకు వేయవద్దు. ఢిల్లీకి సూటు కేసులు పంపడంలో ముఖ్యమంత్రి,మంత్రులు బిజీగా వున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. రాష్ట్రంలో దౌర్జన్యం చేసి కాంగ్రెస్ నేతలు వసూలు చేస్తున్నారు.

తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ గెలిచి వుంటే దేశంలో అగ్గిపెట్టే వాడిని. చిన్న దెబ్బ తగిలింది…తట్టుకుంటా నిలబడతా. నేను ఏ పధకం తెచ్చినా కులం,మతం చూడలేదు. పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు. ఎవరికి అధికారం శాశ్వతం. మా మీద కొంతమంది మొరిగారు…అయినా పోలీసులను వాడుకోలేదు.

కాంగ్రెస్,బీజేపీ నేతలకు జై తెలంగాణ అనే ధైర్యం ఉందా. గులాబీ జెండానే తెలంగాణకు రక్షణగా ఉంటుంది. భూమి,ఆకాశం వున్న రోజులు బిఆర్ఎస్ వుంటుంది. కొంతమంది నేతలు వెళ్తే బిఆర్ఎస్ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. నలుగురు నేతలు పార్టీ మారితే బిఆర్ఎస్ కు ఏం కాదు

కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావిస్తూ మనిషి పళ్ళల్లో ఒకటి దెబ్బతింటే 32 పళ్ళు తీసేస్తామా అని ప్రాజెక్టులో ఒక పిల్లర్ దెబ్బ తిన్న అంశానికి పోల్చారు. కెసిఆర్ ప్రసంగం ఆసాంతం బిజెపి,  సిఎం రేవంత్ రెడ్డి మాట తీరు, కాంగ్రెస్ వాగ్దానాలపై విమర్శనాస్త్రలతో సాగినా మునుపటి పదును తగ్గిందని అనుకుంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్