Sunday, January 19, 2025
HomeTrending Newsఆత్మవిమర్శ లేని బీఆర్ఎస్ సమీక్షలు

ఆత్మవిమర్శ లేని బీఆర్ఎస్ సమీక్షలు

శాసనసభ ఎన్నికల్లో ఓటమి భారం నుంచి బీఆర్ఎస్ నేతలు కోలుకున్నట్టుగా కనిపించటం లేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నట్టుగా ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే గులాబీ నేతలు భావిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దిగిన తర్వాత కొద్దిరోజుల్లోనే అనారోగ్యం పాలైన పార్టీ అధినేత కెసిఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఎంపి స్థానాల వారిగా సమీక్షలు ప్రారంభించారు. చేవెళ్ళ లోక్ సభ స్థానంపై సమీక్ష చేసిన కేటిఆర్…పార్టీ అభ్యర్థిగా ఎంపి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. నిజామాబాద్, మెదక్, జహిరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ స్థానాలపై సమీక్ష నిర్వహించగా వీటి పరిధిలో పార్టీ ఓటమికి గల కారణాలపై ఇప్పటివరకు ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా కనిపించటం లేదు.

నిజామాబాద్ పరిధిలో ఎమ్మెల్యేల విధానాలు, పార్టీ ఓటమిపై చర్చ జరిగింది. అదీ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించటంతో కొంత మందలింపు ధోరణిలో సాగిందని సమావేశంలో పాల్గొన్నవారు చెపుతున్నారు. అది మినహా మిగతా అన్ని సమీక్షల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అసాధ్యమని, వాటిని అమలు చేయటం ఆచరణ సాధ్యం కాదని కేటిఆర్, హరీష్ రావులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు నేతల విమర్శలు, ఆరోపణలు పరిశీలిస్తే ప్రజలు కారు గుర్తును కాదనుకొని ఇబ్బందుల్లో పడ్డారని…లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీనే ఆదరిస్తారనే భ్రమల్లో ఉన్నట్టు విశ్లేషణలు జరుగుతున్నాయి.

అధికారంలో ఉన్నపుడు పార్టీ పటిష్టత, నేతలకు కొంత అందుబాటులో ఉండలేకపోయామని కేటిఆర్ అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు పార్టీ పదవుల్లో ఉన్నవారికి ఎవరు విలువ ఇచ్చారని…అధికారం మాయలోనే అగ్రనేతలు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏ జిల్లాకు ఎవరు అధ్యక్షుడో పార్టీ నేతలకే అంతుపట్టని రోజులు అవి. ఇపుడు అది సరిద్దిద్దాల్సింది పోయి కేటిఆర్, హరిష్ రావు లు ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో పడ్డారని విమర్శలు వస్తున్నాయి.

క్షేత్ర స్థాయిలో చూస్తే బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయని గులాబీ నేతలే అంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది. ఎక్కడా అధికారంలో లేని బీఆర్ఎస్ భవిష్యత్తు ఏందో అర్థం కావటం లేదని కారు నుంచి దిగేందుకు కొందరు నేతలు సిద్దం అయ్యారని తెలంగాణ భవన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కాళేశ్వరంపై విజిలన్సు విచారణ, ధరణిపై అత్యున్నత కమిటీ, TSPSC సభ్యుల రాజీనామాల ఆమోదం, ఈ-రేసింగ్ వ్యవహారంలో ప్రజాధనం దుర్వినియోగం, పోటీ పరీక్షలు రాయకుండానే సిఎం బంధువులకు ఉద్యోగాలు రాబోయే ఎన్నికల్లో అధికార పక్షానికి అస్త్రాలుగా మారనున్నాయి.

బీఆర్ఎస్ నాయకత్వంలో మార్పు రాకపోతే లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి తిరస్కారం తప్పదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఏం చెప్పుకొని ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందో అర్థం కావటం లేదని, అగ్రనేతలకు అధికార మత్తు వదలలేదని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్