పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బిఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో, నేతలతో చర్చించి.. ఆచి తూచి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్.. సమరానికి సన్నద్ధం అయ్యారు. బిఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి “ గా నిలిచిందని గులాబీ నేతలు అంటున్నారు.
లోక్ సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీ లకు పెద్ద పీట వేయడం పట్ల బిసి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత నివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచిందన్నాయి. ఎస్టీ ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బిఆర్ఎస్ కేటాయించిన స్థానాలను పరిశీలిస్తే…
హైదరాబాద్ మినహా 16 స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులతో వరసగా చర్చలు జరిపి సమష్టి నిర్ణయంతో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 5 రిజర్వుడ్ స్థానాలున్నాయి. వాటిల్లో రెండు ఎస్టీ రిజర్వ్ స్థానాలుండగా వాటిలో ఒకటి లంబాడ మహిళకి ( మహబూబాబాద్ ) కేటాయించగా మరో స్థానాన్ని ( ఆదిలాబాద్ ) ఆదివాసి వర్గానికి బిఆర్ఎస్ అధినేత కేటాయించారు.
ఇవి పోగా మిగిలిన మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో ..రెండు పార్లమెంటు స్థానాలను మాదిగలకు (నాగర్ కర్నూల్, వరంగల్ ) కేటాయించగా..పెద్దపెల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది.
మిగతా 11 స్థానాల్లో 5 స్థానాలను బీసీలకు కేటాయించి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. రెండు స్థానాలను మున్నూరుకాపులకు(జహీరాబాద్, నిజామాబాద్) , ఒక స్థానాన్ని ముదిరాజ్ (మెదక్ )లకు, ఒకటి గొల్ల కుర్మలకు(భువనగిరి), ఒక స్థానాన్ని ( సికింద్రాబాద్ ) గౌడ్ సామాజిక వర్గాలకు కేటాయించి.
హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బిఆర్ ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమౌతుంది.
కాగా… హైదరాబాద్ నుంచి పోటీ లో బీసీ అభ్యర్థినే అధినేత ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీలకే ఖరారైతే..రిజర్వుడ్ పోగా మిగిలిన 12 సీట్లల్లో 6 సీట్లు… యాభై శాతం బీసీలకే కేటాయించినట్లు అవుతుంది.
ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. వాటిలో నాలుగు రెడ్లకు ఒకటి కమ్మ ఒకటి వెలమ సామాజిక వర్గానికి బిఆర్ఎస్ పార్టీ కేటాయించింది.
-దేశవేని భాస్కర్