Friday, November 22, 2024
HomeTrending Newsపార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ పోటీ..?

పార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ పోటీ..?

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించామని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నపుడు లేని సమతూకం ఇప్పుడు గుర్తుకొస్తోందని కాంగ్రెస్, బిజెపిలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

మొత్తం 17 మంది అభ్యర్థుల్లో బీఆర్ఎస్ గెలవగలిగిన స్థానాలు ఎన్ని అని పార్టీ నేతల అభిప్రాయాలు కోరితే నోరేల్లబెడుతున్నారు. ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ స్థానాలు మినహా మరెక్కడా పార్టీ విజయానికి అవకాశాలు లేవని గులాబీ నేతలే గుసగుసలు పెడుతున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలు రిజర్వుడ్ సీట్లు కావటం గమనార్హం. వీటిల్లో ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ పై కొంత ఆశలు ఉన్నాయని అంటున్నారు.

పెద్దపల్లిలో కాంగ్రెస్, బిజెపి నుంచి ఇద్దరు కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు నియోజకవర్గం కొట్టిన పిండి కావటంతో ప్రజలతో తొందరగా మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణపై అధికార పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి గతంలో కాంగ్రెస్ నేత కావటం మైనస్ కాగా.. మోడీ ఇమేజ్ తో కొట్టుకు రావచ్చని కమలం నేతలు ధీమాగా ఉన్నారు.

నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత పోటీ ఇవ్వనున్నారు. బిజెపి నుంచి ప్రస్తుత ఎంపి రాములు కుమారుడు భరత్ పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కు విజయవాకాశాలు ఉన్నా మల్లు రవి మాల సామాజికవర్గం కావటంతో మాదిగల్లో అసంతృప్తి ఉందని అంటున్నారు. స్వేరోస్ ను పక్కన పెట్టి ప్రవీణ్ కుమార్ ప్రజల్లోకి వెళితే కొంత సానుకూలత ఉంటుందని అంటున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించి ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్ కు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్, బిజెపిలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి.

పార్టీకి కంచుకోటలుగా ఉన్న కరీంనగర్, మెదక్ స్థానాల అభ్యర్థుల విషయంలో పార్టీ నేతల్లో, ప్రజల్లో భిన్న స్పందన కనిపిస్తోంది. బోయినిపల్లి వినోద్ గతంలో ఎంపిగా ఓడిపోయినా కీలక నేతగా జిల్లాలో చక్త్రం తిప్పారు. సామాన్య కార్యకర్తలు, నేతలకు ఆయన అందుబాటులో ఉండేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. బిజెపి నుంచి బలమైన నేత బండి సంజయ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది తేలితే మరింత స్పష్టత వస్తుంది.

మెదక్ లో ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి అభ్యర్థిత్వపై పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ప్రజల్లో ఉండే నేతలకు కాకుండా అర్థబలం ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వటం సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చని పార్టీలో చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించినపుడు అధికార పార్టీకి కొమ్ము కాశాడనే ఆరోపణలు విజయవకాశాలను దెబ్బతీయవచ్చని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ లో ఆత్రం సక్కుపై ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. బిజెపి నుంచి గోడం నగేష్ బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావలసి ఉంది. బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఆదివాసిలు కావటం ఇద్దరిలో ఒకరు పశ్చిమం, మరొకరు తూర్పులో పట్టు కలిగి ఉన్నారు. ఇక్కడ హోరా హరీ పోరు ఉంటుందని సమాచారం.

వరంగల్ నియోజకవర్గంలో కడియం కావ్యకు ఇవ్వటం కొంత కలిసి వచ్చే అంశం. ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం రాజకీయ రగడకు దారితీసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని తెలిసింది. కడియం కావ్య రాజకీయాలకు కొత్త కావటం…ఆమె తండ్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణులను దగ్గరుండి నడిపిస్తారని నేతలు భరోసాతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

హైదరాబాద్, నల్గొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, చేవెళ్ళ మహబూబ్ నగర్ స్థానాల్లో పార్టీ ఉనికి కాపాడుకునేందుకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. జాహిరాబాద్, మహబూబాబాద్ అభ్యర్థులపై పార్టీలో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది.

ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు బలమైన అభ్యర్థి అయినా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అంతగా సానుకూలత లేదని అంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పోటీ నామ్ కే వస్తే అన్నట్టుగా మారింది.

కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తు మీద పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువు అయ్యారని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ వరకు బాజిరెడ్డి పేరు పరిచయం. పార్టీ ఉన్నది అని చెప్పుకునేందుకే అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ ఉంది. బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావలసి ఉంది.

రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కొనసాగుతోందని.. ఒకటి రెండు చోట్ల పోటీ తీవ్రంగా ఉన్నా పార్టీ కాకుండా అభ్యర్థుల గుణగణాల మీదనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతల ప్రచారం తగ్గించి.. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయటం మంచిదని హితవు పలుకుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్