Saturday, November 23, 2024
HomeTrending NewsBRS: నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతులు

BRS: నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతులు

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులతోపాటు పలువురు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు బీఆర్‌ఎస్‌లో చేరడంతో జోష్‌ నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరినవారికి పార్టీ విధానాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. నాందేడ్‌లోనిర్వహించనున్న ఈ తరగతులకు 1,000 మంది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ రెండు రోజులపాటు నాందేడ్‌లోనే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

రెండు రోజుల శిక్షణ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీ అనుబంధ సంఘాలను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పార్టీ కమిటీలను ఏర్పాటుచేసి జిల్లాలవారీగా బాధ్యులను నియమించనున్నారు. అనంతరం నెల రోజులపాటు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బూతు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఎక్కడికక్కడ రైతులతో ర్యాలీలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాలీ లేదా పెద్ద సభను నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేసి జాతీయస్థాయి రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న దివంగత విలాసరావు దేశ్‌ముఖ్‌ బంధువు సచిన్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు మరో 60 మంది ముఖ్య అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్