Tuesday, September 17, 2024
HomeTrending Newsనాగర్ కర్నూల్, హైదరాబాద్ బీఎస్పికి.. కారుతో ఏనుగు షికారు

నాగర్ కర్నూల్, హైదరాబాద్ బీఎస్పికి.. కారుతో ఏనుగు షికారు

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తులు, కొత్త స్నేహాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీఎస్పి మధ్య పొత్తుపై చర్చలు కొలిక్కివచ్చాయి. హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపి స్థానాలు బీఎస్పికి ఇచ్చే విధంగా మిగతా 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కు బీఎస్పి మద్దతు ఇవ్వనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రెండు పార్టీల నేతలు ఈ నెల 5న  చర్చించుకున్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు.

నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్ నుంచి పోటీ చేసేందుకు బీఎస్పి నేత గణపతి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. నాగర్ కర్నూల్ స్థానంలో ప్రవీణ్ కుమార్ గెలుపునకు బీఆర్ఎస్ తో స్నేహం కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళిత బహుజనుల గొంతుకగా ప్రవీణ్ కుమార్ లాంటి మేధావులు చట్టసభలకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

పొత్తులపై నాగర్ కర్నూల్ పరిధిలోని నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు పొత్తులపై హర్షం వ్యక్తం చేశారు. బీఎస్పికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ జరిగే విధంగా త్వరలోనే ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో SCల ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. పొత్తు కలిసివస్తుందని గులాబీ నేతలు భావిస్తున్నారు.

పొత్తులతో బీఎస్పి లబ్ది పొందే సూచనలు మెండుగా ఉన్నాయి. బిజెపి తరపున సిట్టింగ్ ఎంపి రాములు కుమారుడు భరత్ తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, సంపత్ కుమార్ ఆశిస్తున్నారు. సంపత్ కుమార్ కు ఇస్తే ప్రవీణ్ కుమార్ గెలుపు అంత సులువు కాకపోవచ్చని అంచనా.

హైదరాబాద్ స్థానం బీఎస్పికి కేటాయించటంతో మిత్ర పక్షం ఎంఐఎంతో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పాయి. బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగానే మజ్లీస్ కోసం ప్రచారం నిర్వహించే సూచనలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో పతంగి స్పీడును ఎవరు ఆపలేరని దారుస్సలాంలో సంబరాలు చేసుకుంటున్నారు. తాజా పొత్తుల ద్వారా నల్లమల అడవుల్లో ఏనుగు అడుగుపెట్టనుందని అంటున్నారు. కారు సహకారంతో ఏనుగు తెలంగాణ రాష్టంలో బోణి కొట్టనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్