Burugadda Temple – Sri Adivaraha Lakshmi Narasimha Venu Gopala Swamy Temple :
సాధారణంగా ఏ క్షేత్రంలో నైనా ఒక గర్భాలయంలో ఒకే ప్రధానమైన దైవం ఉంటుంది. ఇక ఇతర దేవతా మూర్తులు ఎవరున్నప్పటికీ, వాళ్ల కోసం ఉపాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకే గర్భాలయంలో .. ఒకే పీఠంపై శ్రీమహా విష్ణువు అవతార స్వరూపాలైన ఆదివరహా స్వామి .. నరసింహస్వామి .. శ్రీకృష్ణుడు ప్రధాన దైవాలుగా పూజాభిషేకాలు అందుకోవడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అరుదైన క్షేత్రంగా ‘బూరుగు గడ్డ’ దర్శనమిస్తుంది. సూర్యాపేట జిల్లా .. హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన, ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ప్రధాన రహదారి నుంచి కొంతదూరం లోపలికి వెళితే ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రాచీన వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. శిధిలావస్థలో ఉన్న సింహద్వారం దాటుకుని లోపలికి వెళ్లగానే, పొడవైన ప్రాకారాలాతో కూడిన ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన హనుమంతుడు కొలువై ఉంటాడు. ఆ స్వామికి నమస్కరించుకుని ప్రధాన మంటపంలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది.
ఈ మంటపానికి ‘అనంతమంటపం’ అని పేరు. మంటపంలో ఎడమవైపున 20 అడుగుల పొడవైన ‘అనంతపద్మనాభస్వామి‘ శిలా రూపం దర్శనమిస్తుంది. ఇది ఏకశిల .. ఇది అక్కడికి ఎలా వచ్చింది .. ఎవరు ఆ రూపాన్ని మలిచారు అనే విషయం ఎవరికీ తెలియదు. అక్కడి నుంచి ప్రదక్షిణ మార్గంలో ముందుకు వెళితే, మనవాళ్ల మహాముని .. రామానుజులవారి సన్నిధి కనిపిస్తాయి. ఆ తరువాత ‘గోదాదేవి’ అమ్మవారు కొలువైన మందిరం దర్శనమిస్తుంది. విశాలమైన కళ్లు .. పెద్ద కొప్పుతో వయ్యారంగా నిలబడిన అమ్మవారి మూర్తి 6 అడుగులు ఉండటం విశేషం.
గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలనే ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది. గర్భాలయంలో వేణుగోపాల స్వామి ఉండటం వలన ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతాయి. గోదాదేవి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక ‘కృష్ణాష్టమి’ వేడుక కూడా ఇక్కడ కనులపండుగగా జరుగుతుంది. కుదురుగా అనిపించే ఇక్కడి కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని చూసి తీరవలసిందే.
సాధారణంగా ఆయా వైష్ణవ క్షేత్రాల్లో 12 మంది ఆళ్వారుల మూర్తులు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలోని ఆళ్వారులు వరుసగా భోజనానికి కూర్చున్నట్టుగా ఉంటారు. నిజంగా ఆళ్వారులు అక్కడ సజీవంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే చెన్న గోపీనాథస్వామి మూర్తి కనిపిస్తుంది. తవ్వకాల్లో విగ్రహం కాస్త దెబ్బ తినడం వలన, ఈ మంటపంలో ఈ మూర్తిని ఉంచడం జరిగింది. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఈ ఒక్క మూర్తిని చూపిస్తే సరిపోతుంది. ‘ర్యాలీ’ జగన్మోహినీ కేశవస్వామి మాదిరిగానే, ఇక్కడి కృష్ణుడిని మలిచిన విధానం అబ్బురపరుస్తుంది.
ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఉపయోగించే తీర్థంగా ‘సూర్య పుష్కరిణి’ ఉంటే, ఆలయం లోపల ఉన్న ‘చంద్రపుష్కరిణి’లోని నీటిని స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. విశాలమైన రాతి పలకల అమరికతో కనిపించే ఈ ఆలయాన్ని, కాకతీయ రుద్రమదేవి కాలంలో స్థానిక అధికారులైన సత్రం బొల్లమరాజు – దేవకీపుత్రదాసు అనే సోదరులు నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ప్ర్రదక్షిణ పూర్తి చేసుకుని ప్రధాన మంటపంలోకి అడుగుపెట్టగానే, గర్భాయలంలోని మూర్తుల దర్శనం లభిస్తుంది.
గర్భాలయంలో ఒక వైపున వేణుగోపాలస్వామి .. మరో వైపున లక్ష్మీ నరసింహస్వామి .. మధ్యలో భూదేవి సమేతుడైన ఆదివారాహస్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలోని మూర్తులన్నీ కూడా నలుపు .. తేనె రంగు కలిసి రాతిలో మలచబడ్డాయి. ప్రతి మూర్తిలోను జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ మూర్తుల కనుముక్కుతీరు చూస్తే ముచ్చట కలుగుతుంది. ఇంతటి అందమైన మూర్తులు ఈ ప్రాంతంలో ఇంతవరకూ చూడలేదు అనిపిస్తుంది. అంతగా దేవతా మూర్తులు కళకళలాడుతూ కనుల పండుగ చేస్తుంటాయి.
వేణు గోపాలస్వామి దర్శన భాగ్యం వలన సంతానం కలుగుతుందనీ .. శ్రీ భూ ఆదివారాహ స్వామి దర్శనం వలన భూ వివాదాలు తొలగిపోతాయనీ .. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం వలన గ్రహపీడలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.
ప్రశాంతమైన .. ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని చూడగానే, మనసు ఆధ్యాత్మిక చింతన దిశగా పరుగులు తీస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఒకే గర్భాలయంలో ముగ్గురు అవతారమూర్తులు ఉండటం .. ముందుగా గోదాదేవి దర్శనం చేసుకోవడం … 20 అడుగుల ఆనంతపద్మనాభుడి ఏకశిల .. ఆళ్వారుల భారీ విగ్రహాలు .. ఎప్పటికీ నీరు ఇంకిపోని సూర్య – చంద్ర పుష్కరిణిలు .. చెన్నగోపీనాథుడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన తీరులోని శిల్ప నైపుణ్యం ఈ క్షేత్ర విశేషాలుగా కనిపిస్తాయి. ప్రశాంతతకు ప్రతీకగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, అడుగడుగునా భక్తిభావ పరిమళాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read: కలవారికి విదేశం లేనివారికే ఈ దేశం
Also Read:కొళాయిల్లో శుద్ధ జలం