Rich Indian’s looking to leave country

డబ్బుకు లోకం దాసోహం.
ధనమూలమిదం జగత్.
డబ్బు డబ్బును ప్రేమిస్తుంది.
మనీ మేక్స్ మెనీ థింగ్స్.
పైసామే హై పరమాత్మ.
మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.

భాష ఏదయినా భావమొక్కటే. భావమేదయినా సారమొక్కటే. సారమేదయినా విషయమొక్కటే. విషయమేదయినా ఉన్నదొక్కటే – డబ్బు.

…జబ్బ పుచ్చుక యముడు
దబ్బు దబ్బున లాగ…
తబ్బిబ్బు పడనేల చిలుకా? అని తత్వ గీతాలు ఎన్ని పాడుకున్నా డబ్బులు లేకపోతే లోకం ముందుకు కదలదు. లేనివారికి లేక ఇల్లు గడవదు. వారు ఇల్లు కదల్లేరు.ఉన్నవారికి ఆ బాధ లేదు. ఉంది కాబట్టి వారు ఇంట్లో ఉండలేరు. ఇల్లు గడుస్తోంది కాబట్టి వారు కూడా గడిచినంత కాలం ఇల్లు విడిచి, నేల విడిచి తిరుగుతూనే ఉంటారు.

ఉన్నవారికి నిత్యం నిత్య కళ్యాణం పార్టీల తోరణంలా జిలుగువెలుగులతో, తళుకు బెళుకులతో నేత్రోత్సవంగా సాగుతూ ఉండాలి. కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతూ ఉండాలి. ఊహలకు రెక్కలు తొడుక్కుని ఎగురుతూ ఉండాలి. డబ్బుతో కొనుక్కోదగ్గ విలాసాలన్నిటినీ కొనుక్కోవాలి. ప్రపంచంలో గొప్ప ఊళ్లన్నీ చూసేయాలి. ప్రపంచంలో ఎక్కడ హాయిగా ఉంటే అక్కడికి సకుటుంబంగా ఎగిరిపోవాలి. అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండిపోవాలి.

ఏటేటా విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయ సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి దేశాల్లో మూడు కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెడితే శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి అనుమతించే వెసులుబాటు ఉంది. ఈరోజుల్లో మూడు కోట్లు పెద్ద విషయమే కాదు.

2014 నుండి ఇప్పటివరకు దాదాపు 25,000 మంది భారతీయ సంపన్నులు ఇలా విదేశాల్లో స్థిరపడ్డారట. పెట్టుబడులకు భద్రత, మెరుగయిన జీవన ప్రమాణాలు, వసతులు, పిల్లల చదువులు, ప్రోత్సాహకాలు, ఆరోగ్య సంరక్షణ లాంటి కారణాలతో సంపన్నులు చాలా మంది శాశ్వతంగా దేశం వదిలి వెళ్లిపోతున్నారు.

Rich Indians Leaving India

ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఎవరి అవసరాలు, ప్రాథమ్యాలు వారివి. చట్టబద్ధంగా లభిస్తున్న వీసా, పౌరసత్వ అవకాశాలను రాజమార్గంలో ఉపయోగించుకుంటున్నారు.

ఆ మధ్య అమెరికా భూభాగం మీదినుండి అంతరిక్షంలోకి రెండు టూరిస్టు స్పేసినేని బస్సులు వెళ్లి వచ్చాయి. నిమిషానికి నాలుగు వేల కోట్లు ఖర్చు అయినట్లు వార్తలొచ్చాయి. అది అంతరిక్ష యాత్ర అవునో! కాదో! సాంకేతికంగా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి, అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రిటీష్ పత్రిక గార్డియన్ లో తాజా అంతరిక్ష యాత్రల మీద లోతయిన విశ్లేషణతో ఒక సంపాదకీయ వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం సారాంశమిది.

“ప్రపంచ కుబేరులు ఇక ఈ భూమి తమకు ఏమాత్రం నివాసయోగ్యం కాదనుకుంటున్నారు. భూమి మురికి కూపం అయిపోయింది. ఎక్కడ చూసినా జనమే జనం. ప్రపంచ కుబేరులు భూమిని అసహ్యించుకుంటున్నారు. అంతరిక్షంలో ప్రశాంతంగా, హాయిగా, ఏకాంతంగా ఉందామనుకుంటున్నారు. రోదసిలో ఇండిపెండెంట్ విల్లా ఉంటే ఆ మజాయే వేరు. పైకి ప్రస్తుత అంతరిక్ష యాత్రలు సాహసంలా అనిపిస్తున్నా- లోలోపల కుబేరులకు అంతరిక్ష గృహాల్లో ఉండిపోవాలన్న సంకల్పానికి ఈ యాత్రలు రిహార్సల్స్ లాంటివి”.

ప్రపంచ కుబేరులు భూమిని వదిలి అంతరిక్షంలోకి వెళుతుంటే; మన భారతీయ సంపన్నులు కేవలం దేశం వదిలి విదేశాలకే వెళుతున్నారు.

ప్రఖ్యాత ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న-

“గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నవీ
ఆ ఇళ్ళకన్న మేలురా ఫలక్ నామా బళ్ళురా
పాత రైలు డబ్బలోలే పడాఉన్నవేందిరో
కలిగినోళ్ల కాలనీల వరద మురుగునీళ్ళురా
వీళ్ళ నల్లా పైపుతోనే వియ్యమందుకుంటయో
వెలుగుతున్న బల్బులా వెలుతురెంత ఉందిరా
నూటికొక్క ఇంట్లకుడా టూబులైటులేదొరో
సెకండ్ హ్యాండ్ టీవిరా దాని శబ్దమేందొ చూడరా
లోటలో రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తదో
ఇంటికొక్క గాథరా విచారిస్తే బాధరా
గాథలన్నీ తెల్సుకుంటే గుండె గాభరైతదో
పాత పంపు ఇనుప టెంకి రోడు మీద పెట్టుకొని
గాలికొట్టే పొరడేమో జాలిగా చూస్తుంటడో
పల్సరున్న పట్టపై ప్రాణాలు పెట్టుకుంటడో
డొక్కు స్కూటరొస్తదని దిక్కులుచూస్తుంటడో
నడుములొంచి తొక్కెటి నాల్గు కిలోల బండిరా
ఉల్లిగడ్డ అమ్మితేనే కడుపులో కురుపొస్తదో
మూడు జాన్ల పోరడు
వాని బాధలేమో బారెడు
వాడు చేసే దందా సారెడు
వానికేడ తీరు బాధలు
కాలే కడుపకాసరా గాలి బుంగలమ్ముడు
పిన్నీసలు రిబ్బన్లు కన్నీరు తుడ్చునా
దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది
ఎవ్వరింట్ల చూసిన అద్దమెందుకో పగిలుంటదీ
చిత్తుబొత్తుకు బతుకులు
సిన సిన దందలూ
చిల్లర కొట్లల్లా వాళ్లు చిన్న ఖాతాలెడతరో
ఏండ్లకేళ్ళు గడిచేరా
ఎట్టి బతుకులింతెరా
ఎవరేలిన గాని గల్లీ రూపమేమి మారెరా”

అని మన దేశంలో గల్లీల్లో నిరుపేదల జీవన చిత్రం చాలా చిన్నదయినా సమస్త భాషలు మాట రాక మూగబోయేంత పెద్దది అని నిరూపించాడు. పిన్నీసులు ఎన్నమ్మితే పేదవాడి కన్నీళ్లు పోతాయన్న ప్రశ్న చాలా పెద్దది. గునపమై గుండెల్లో గుచ్చుకునేంత పెద్దది. ఎంత వెతికినా సమాధానం దొరకనిది. పాట వినదలుచుకున్నవారికోసం యూట్యూబ్ లింక్:-

కలవారికి-
జీనా వహా!
మర్నా వహా!
ఉస్ కే శివా జానా కహా?

నిరుపేదలకు-
జీనా యహా!
మర్నా యహా!
ఇస్ కే శివా జానా కహా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: నిత్య భారసహిత స్థితి

Also Read:మాయమైపోతాడమ్మా మనిషన్నవాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *