Collapse of Human Society – MIT study

భూమి అంతమవుతుందని, మిన్ను విరిగి మీద పడుతుందని, ప్రళయం ముంచుకొస్తుందని, యుగాంతమవుతుందని హాలీవుడ్ సినిమాలు భయపెడుతూ ఉంటాయి. అంత భయంకరమయిన కథాంశాలతో కూడిన సినిమాలను మనం సరదాగా, కాలక్షేపంగా, నవ్వుతూ…మధ్య మధ్యలో ఒక మూట పాప్ కార్న్ విప్పి తింటూ చూస్తాం. సినిమా అయిపోయాక బయటికొస్తూ – భూమి రెండుగా చీలి, మాడి మసైపోయి, నామరూపాల్లేకుండా భలే ఉంది కదా! అని ఆశ్చర్యపోతాం. మానవజాతి అంతమైపోయే సీన్ గ్రాఫిక్స్ రియల్ గా ఉన్నాయి కదా! అని డైరక్టరును ప్రశంసిస్తూనే ఉంటాం.

సినిమా కథలు కల్పన. నిజ గాథలు కూడా మనకు కల్పనలానే అనిపిస్తాయి. అలా యాభై ఏళ్ల కిందట అంచనా వేసి చెప్పిన ఒకానొక మానవ విధ్వంసం ఇప్పుడు చూస్తున్నాం.

పతనం దిశగా మానవాళి
2040-50 ల నాటికి మానవ సమాజం పతనావస్థకు చేరుకుంటుందని 1970 ప్రాంతాల్లోనే అమెరికాలో ప్రఖ్యాత యూనివర్సిటీ మెసాచుసెట్స్- ఎం ఐ టీ పరిశోధకులు అంచనా వేసిన పత్రాలు ఇప్పుడు బయటపడ్డాయి.ఇందులో ప్రధానాంశాలు:-

# ఆర్థిక ప్రగతి తప్ప ప్రపంచానికి పర్యావరణం, ఆహారోత్పత్తి, ఆరోగ్య పరిరక్షణ పట్టదు.

# పారిశ్రామిక ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోతాయి.

# మనుషుల జీవన నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి.

# కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.

# పునరుత్పాదక ఇంధనాలు దొరకవు.

# పీల్చే గాలి కలుషితమై మనుషుల ప్రాణాలను మింగేస్తుంది.

# తినే తిండి, తాగే నీరు…అంతా రసాయనాలతో నిండి మనుషుల ఆయుస్సు తగ్గిపోతుంది.

# చిన్న చిన్న సమస్యలు కూడా భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తాయి.

# ప్రపంచ జనాభా తగ్గుతుంది.

సరిగ్గా ప్రస్తుత కరోనా పరిస్థితులకు ఈ పరిశోధన ఫలితాలతో ముడిపెట్టి విశ్లేషణలు మొదలయ్యాయి. వీరు అంచనా వేసిన 2040-50 ల పరిస్థితి ఇక ఎలా ఉంటుందో?

ప్రకృతి- వికృతి
ఇప్పటికయితే భూగోళం ఒక్కటే మనిషికి నివాస యోగ్యం. పుట్టుక నుండి చావు వరకు మనకు ఏది కావాలన్నా భూమే ఇవ్వాలి. చివరికి భూమిలోనే కలిసిపోవాలి. ఓర్పుకు భూమి ప్రతి రూపం. అలాంటి భూమి ఓపిక కూడా నశించేంతగా మనం గుండెల్లో గుచ్చాము. మంటలు పెట్టాం. మలినాలు చల్లాము. హైబ్రిడ్ మోజుల్లో ప్రసవ శక్తిని దాటి ఒకే కాన్పులో పది మందిని కనాలని భూమికి షరతులు పెట్టాం. వినకపోతే విష రసాయనాలు గొంతులో పోశాము. భూమిని చెరబట్టాం. పంట పొలాల గుండెలు కోసి ప్లాట్లు వేసి అంగుళాల్లో అమ్మాము. సెంటీ మీటర్లలో బహుళ అంతస్థుల భవనాలు కట్టాము. పచ్చని పొలం కనపడితే అగ్గి పెట్టాము.

విటమిన్ ట్యాబ్లేట్లు కొంటాం.
మినరల్ బాటిళ్ల నీళ్లు కొంటాం.
సిలిండర్లలో ప్రాణవాయువు కొంటాం.
పండుకు బదులు గోళీ వేసుకుంటాం.
కాయకు బదులు మాత్ర వేసుకుంటాం.
సూర్యరశ్మికి బదులు డి చప్పరిస్తాం.
చంద్రకాంతి పడక పిచ్చివాళ్లమవుతాం.
బాగున్నా ఆసుపత్రులకు వెళుతుంటాం.
బాగాలేకపోతే ఐ సీ యూ ల్లో పడుకుంటాం.

వింత వింత రోగాలు వచ్చినట్లు డాక్టర్ల కంటే ముందే మనమే పసిగట్టగలుగుతాం. అంత పెద్ద రోగం రావడమే గొప్ప అదృష్టమన్నట్లు ఆకాశహర్మ్యం ఆసుపత్రిలో చేరతాం. అక్కడి నుండి వస్తే ఇంటికి- పొతే మంటికి అన్నట్లు ఊగుతూ ఉంటాం.ప్రకృతి ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. కలియుగంలో ఈ సహస్రాబ్దంలో ఆ హెచ్చరికల్లో కరోనా అతి పెద్ద హెచ్చరిక. వింటున్నారా!

-పమిడికాల్వ మధుసూదన్

Read More: కరోనాలో కరువు మాసం

Read More: కలవారి చేతిలో విలువయిన కాలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *