మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టిపెట్టాల్సిన అవసరంఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష వైపు ఆకర్షితమౌతాయని తెలిపారు. ప్రభుత్వాలు భాషను కాపాడాలని సంకల్పిస్తే నిధులు ఇవ్వగలదని, అదే సంకల్పం ప్రజలు తీసుకున్నప్పుడే తరతరాలకు మనగలదని దిశానిర్దేశం చేశారు.
“తెలుగు కూటమి” సంస్థ నిర్వహించిన భాషాభిమానుల అంతర్జాల సదస్సులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.

ఇటీవల సుప్రీం కోర్టులో ఆంగ్లంలో తన సమస్యను చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళకు మాతృభాష అయిన తెలుగులో మాట్లాడే అవకాశం ఇచ్చి, 21 సంవత్సరాలుగా సాగుతున్న భార్యాభర్తల వివాదాన్ని సానుకూల మార్గంలో పరిష్కరించిన చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్.వి.రమణ గారి చొరవను ఉపరాష్ట్రపతి అభినందించారు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యలను తమ మాతృభాషలో తెలియజేసే అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భం ద్వారా రుజువైందని తెలిపారు.

మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతామన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను కాపాడుకునే సంకల్పంతో వివిధ నేపథ్యాలకు చెందిన వారంతా తెలుగు కూటమి సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్న తన ఆకాంక్ష వెనుక ప్రధాన కారణం ఇదేనన్న ఆయన, ప్రభుత్వాలు తమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాయని, అయితే ప్రజలంతా కలిసి తమ భాషను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పుడు ముందు తరాలకు అందజేయడం సాధ్యమౌతుందని తెలిపారు. మన సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే పరిరక్షించుకోవచ్చన్న ఉపరాష్ట్రపతి, భాషంటే ఘనమైన వారసత్వమని తెలిపారు.

ఒక పటిష్టమైన భాషా విధానం ఉంటే ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చన్న యునెస్కో తీర్మానాన్ని ఉటంకించిన ఉపరాష్ట్రపతి, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భాషా విధానాన్ని ప్రకటించడంతో పాటు, ఆచరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన విద్యావిధానంలో మాతృభాషకు పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, అభ్యాసంతో సంస్కృతి, భాష, సంప్రదాయాలను సమీకృతం చేసినప్పుడే పిల్లలు సమగ్రమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలరని, నూతన విద్యా విధానం దీనికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇటీవల నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ఆయన, వారికి అభినందనలు తెలిపారు.అంతరించిపోతున్న భాషల పరిరక్షణ మరియు ప్రోత్సాహ పథకం (SPPEL) ద్వారా మన మాతృభాషల పరిరక్షణ కోసం కేంద్ర విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలను సైతం ఉపరాష్ట్రపతి అభినందించారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భాషాభిమానులు, భాషావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా మాతృభాష పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తిని పొందాలని స్పష్టం చేశారు. అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతున్నాయన్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమతమ మాతృభాషలు సంరక్షించుకునేందుకు అనుసరించిన విధానాలను కూలంకషంగా అధ్యయనం చేసి, మన మాతృభాషల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు.

ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతున్నంతంగా తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదని, ఇందు కోసం తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యాన్ని సరళ తెలుగులో యువతకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలన్న ఆయన, సాంకేతికంగా భాషా వినియోగం మరింత విస్తృతం కావాలని సూచించారు. వీటితో పాటు మారుమూల గ్రామాల నుంచి భాషాపదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికి తీసి కాపాడుకోవడం, శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాలను తయారు చేయడం,వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివిఆవశ్యకమని తెలిపారు.

తెలుగు భాషను కాపాడుకునే దిశగా తెలుగు కూటమి చేపట్టిన అనేక కార్యక్రమాలను అభినందించిన ఉపరాష్ట్రపతి,భాషగా మాత్రమే మాతృభాషలను నేర్చుకునే పరిస్థితి ఉండకూడదన్న తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల్లో మాతృభాష వినియోగం మరింత పెరగాలన్న ఆయన,చిత్తశుద్ధి ఉంటేనే కార్యసిద్ధి జరుగుతుందని నొక్కిచెప్పారు. మాతృభాషలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని గట్టిగా చెప్పడం వెనుక తన ఉద్దేశం ఇతర భాషలను అశ్రద్ద చేయమని కాదని, యువతమాతృభాషతో పాటు, సోదర భాషలను కూడా అధ్యయనం చేయాలని, అదే సమయంలో మాతృభాష విషయంలో బలమైన పునాది కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకమని సూచించారు.

భాషాభిమానం ఉండాలే గానీ దురాభిమానం తగదని.. ప్రతి ఊరిలోనూ రాజకీయాలకు అతీతంగా మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగు కూటమి లాంటి బృందాలు ఏర్పడాలని, మన అమ్మ భాషను సజీవంగా ఉంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ప్రజలు చైతన్యవంతమై ముందుకు వస్తే, ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు మరింత ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తే, ప్రజలు కూడా దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ భాషలను ప్రోత్సహించాలనే సంకల్పమున్న ప్రధానమంత్రి, తెలుగుభాషాభివృద్ధిపై సానుకూలమైన ఆలోచన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కారణంగా భాషావికాసానికి బాటలు పడుతున్నాయన్న ఉపరాష్ట్రపతి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషిచేయడం శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. వి. రమణాచారి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి నందివెలుగు ముక్తేశ్వర రావు, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి చెన్నూరు ఆంజనేయరెడ్డి, తానా మాజీ చైర్మన్శ్రీ తాళ్ళూరి జయశేఖర్, ద్రవిడ విశ్వవిద్యాలయ డీన్శ్రీ పులికొండ సుబ్బాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, భారత భాషాశాస్త్రవేత్తల సంఘం అధ్యక్షులు గారపాటి ఉమామహేశ్వర రావు, తెలుగు కూటమి అధ్యక్షులు పారుపల్లి కోదండరామయ్య సహా ప్రపంచంలోని పలు దేశాలకు దాదాపు వెయ్యిమంది తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు అంతర్జాలం ద్వారా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *