Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆగి ఆగి సాగిన ప్రయాణం

ఆగి ఆగి సాగిన ప్రయాణం

Bus Journey: విజయవాడ నా కర్మ భూమి.
‘క’ అల్ప ప్రాణమే. అదే ‘క’ మహా ప్రాణమయితే ఖర్మ భూమి అవుతుంది. ఒక్కోసారి నా అల్ప ప్రాణానికి విజయవాడ ‘క’ మహా ప్రాణమే అవుతుంటుంది. ఖర్మ ఫలం అనుభవించాలే కానీ, బాధ పడకూడదు. అన్నిటికిమించి విజయవాడ మా అత్తగారి ఊరు. అత్తసొమ్ము అల్లుడిగా నేను దానం చేయడానికి అక్కడ మా మామ ఏమీ మిగల్చలేదు. విజయవాడ మా ఆవిడకు కొట్టిన పిండి. నాకేమో విజయవాడ ఎండలు కొడుతున్న పిండి. పిండి కొద్దీ రొట్టె అనుకుని విజయవాడలో అన్ని రుతువుల్లో మండే ఎండల్లో తిరగడం నా అవసరం.

విజయవాడ-హైదరాబాద్ మధ్య విమానంలో వెళ్లడం కంటే నడిచి వెళితే ఓ గంట ముందు చేరుకోవచ్చు. రైల్ బాధ రైలుది. వోల్వో డబుల్ యాక్సిల్ బస్సులు బాగుంటాయి. కానీ వేసిన సినిమాలే వేసి హై వాల్యూమ్ లో చెవుల్లో రక్తం కారేలా వోల్వోలు పెట్టే హింసకు భారత శిక్షా స్మృతిలో సరయిన క్లాజులు లేవు.

ఎప్పటిలా మొన్న ఒకరోజు విజయవాడకు వెళ్లగానే అర్జెంట్ పని మీద కారు హైదరాబాద్ కు వెనక్కు పంపాల్సి వచ్చింది. విజయవాడలో తిరగడానికి అడగ్గానే ఓ మిత్రుడు డ్రైవర్ తో పాటు కారు పంపాడు. పనులు పూర్తి చేసుకుని అమరావతి వోల్వో డబుల్ యాక్సిల్ బస్సెక్కా.

అంతే…వెతకబోయిన ప్రమాదం కాలికి తగిలినట్లు సీట్లో కూర్చోగానే టీ వీ లో చెవులు పగిలే సౌండ్ తో సినిమాలు మొదలయ్యాయి. ఒక్క సినిమా కూడా పూర్తి కాకుండా సూర్యాపేట వచ్చేలోపు ఇస్మార్ట్ శంకర్, ఢీ, శ్రీమంతుడు ఇంకేదో గుర్తు పెట్టుకోవడానికి వీల్లేని నాలుగు సినిమాలు వేశాడు. శ్రీమంతుడులో శృతి హాసన్ ముగ్గు వేస్తుండగా మహేష్ బాబు దారి మరచి అక్కడక్కడే తిరుగుతున్నాడు. బస్సులో సినిమాలు కూడా ఆటో ప్లే వల్ల అక్కడక్కడే తిరుగుతున్నాయి.

పెద్ద పెద్ద హోటళ్లను వదిలేసి ఒక రోడ్డు పక్క చెట్టు కింద కట్టెల పొయ్యి హోటల్ ముందు అమరావతి దేవేంద్రుడి బస్సు ఆగింది. లోపల ఏమి వండారో తెలియని పెద్ద హోటళ్ల కంటే…మన ముందే కట్టెల పొయ్యి మీద వండిన వేడి ఇడ్లి ఏ రకంగా చూసినా మంచిదే.

మళ్లీ బస్సెక్కగానే మహేష్ బాబు రూరల్ డెవెలప్ మెంట్ ఎం బి ఏ అడ్మిషన్ ఏమయ్యిందో కానీ…అల్లరి నరేష్ అకారణంగా జైలుకు వెళుతున్నాడు. జైలు గేట్లు తెరుచుకోగానే ఇస్మార్ట్ పోతినేని గోవాలో పోలీసులను కొడుతున్నాడు.

పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయయితే ఏమిటి? అన్న వేదాంత సారం తెలియజేయడమే ఆర్ టి సి ఉద్దేశం అయి ఉంటుంది. లేదా సకల సినిమాల సారం ఒకటే అని ఆర్ టీ సీ కి జ్ఞానోదయమై…ఆ జ్ఞానం మనకు పంచడంలో భాగంగానే ఈ అరకొర మిక్సింగ్ సినిమాల ప్రదర్శన అయి ఉండవచ్చు.

సినిమాలు వదిలి…బస్సు అద్దంలో నుండి బయటికి చూస్తే…కళ్లు చూడలేనంత ప్రపంచం.
హై వేలు వచ్చి దారిలో ఊళ్లన్నీ బై పాస్ కావడం ఊళ్లకు జరిగిన అవమానం.
దారికి ఊరు పుట్టదు.
ఊరికే దారి పుట్టాలి.
ఊరికే హై వే మీద వెళితే ఊరెప్పటికి తెలుస్తుంది?
ఊరంటే మట్టి కాదు- మనుషులు.
దారంటే హై వేలు కాదు- ఊళ్లను కలిపే బంధాలు.

బస్సు ఆగి ఆగి సాగుతుంటే ఒక్కో హాల్ట్ ఒక్కొక్క కథ చెబుతోంది.
ఒక్కొక్క యాస పండుతోంది.
భాష రాయలేనన్ని కథలను బస్సు మోసుకెళుతోంది. మోసుకెళుతూనే ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

బైక్ రైడింగ్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్