Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవైద్య వ్యాపార లక్ష్యాలే ప్రధానం 

వైద్య వ్యాపార లక్ష్యాలే ప్రధానం 

వ్యాపారం అన్నాక లాభాల కోసం వెంపర్లాడటం సహజం. విద్య, వైద్యం కూడా వ్యాపారం అయిపోయాక.. అక్కడ లాభాలు పండించుకోవాలనుకోవడం సహజం.
కొంతమంది లక్ష్యాలు వింటే గుండె గుభిల్లుమంటుంది. శరీరం కుప్పకూలుతుంది. అందులోనూ అది ఒక కార్పొరేట్ ఆసుపత్రిది అయితే.. నిలువెల్లా గడ గడ వణకాల్సిందే.
ఎందుకు పుట్టామో తెలియదు. ఎందుకు పెరుగుతున్నామో తెలియదు. పుట్టాము కాబట్టి బ్రతకాలి.  ఇక  బ్రతకటానికి నానా గడ్డి తినాలి. తప్పదు.
పుట్టినవాడు గిట్టక తప్పదు. తెలుసు.  గిట్టకుండా బ్రతకాలనే మన తపన. బానే ఉంది. బ్రతుకుతూనే ఉన్నాం. కానీ ఎలా..
నీరసం. ఆయాసం. రోగం.
శరీరానికి ఏదో బాధ.
గాలి కలుషితం. నీరు కలుషితం. తిండి కలుషితం.  ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు, ప్లాస్టిక్ భూతం.. ఎవరూ గుర్తు పట్టలేనంతగా తిండిలో కలిసి పోయాయి. శరీరంలో ఇంకిపోతున్నాయి.
తింటే రోగం. తినకపోతే.. బ్రతకం.  అడ్డమైనవీ  తిన్నాక.. కడుపులోనో, కంట్లోనో.. కాలులోనో, వేలులోనో నొప్పో, వాపో రాక తప్పదు.
తిన్నదో, తాగిందో, నాకిందో,  పీల్చిందో.. శరీరంలో ఇమడక.. కాస్త వొళ్ళు వెచ్చబడకా  తప్పదు. ఆ నొప్పి తోనో, ఈ కాక తోనో.. ఈ బ్రతుకు ఇక్కడతో తెల్లారుతుందేమో అనే భయంతోనో.. ఆసుపత్రికి పరుగు తప్పదు.
కడుపుకో డాక్టరు. కంటికో డాక్టరు. పంటికో డాక్టరు. తుంటికో డాక్టరు.  నొప్పి కడుపు నుంచి కాలికొచ్చిందా, కాలు నుంచి కంటికొచ్చిందా, పంటి నుంచి తుంటి కొచ్చిందా.. తెలియందే వైద్యం కష్టం అని ఆ డాక్టరు పెదవి విరుస్తాడు. రకరకాల టెస్టులు. అన్నీ చేయించాల్సిందే.  డాక్టర్ మారాం చేస్తాడు. వాళ్ల టార్గెట్ వారిది.  అన్నీ  అక్కడే ఉంటాయి.  ఇక జ్వరం అయితే.. దానికి కారణం..  ఈగనో, దోమనో, కోడో, కుక్కో తెలిసి తీరాలి అంటాడు.  బ్రతకాలి కాబట్టి.. గుండె మీద జేబు అంతా ఖాళీ చేసుకొని.. గుండె బరువు తగ్గించుకొని.. వొళ్ళు  కుళ్ళబొడిపించుకొని, రక్తం ధారపోసి.. ఆ పరీక్షలకు నిలబడాలి.  పరగడుపున కొన్ని.  తిన్నది అరిగేటప్పుడు కొన్ని.  అరిగిన తర్వాత కొన్ని. 
ఆ ఫలితాలన్నీ పోగేసుకొని.. డాక్టరు చేతికిచ్చి.. ఆయన వాటిని ఎగా దిగా చూస్తుంటే.. ఊపిరి బిగపట్టి, ఆయన ముఖంలో మారే రంగులను చూస్తూ ఉండాలి. గుండె జారకుండా జాగ్రత్త పడాలి.  తరువాత ఆ డాక్టరు ఇచ్చే 6 మాత్రలు, రెండు సిరప్ లు నాలుగు పూటలా.. అన్నంతో సమానంగా.. మింగాలి.  
నాలుగు రోజుల్లో ఆ వాపో, కాకో తగ్గిందా సరి. లేదంటే.. మరోసారి పరీక్షలు, మందులు.   అప్పో , సొప్పో చేయాలి. వైద్యం చేయించాలి.  బ్రతకాలిగా మరి.
అయినా కార్పొరేట్ వైద్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.  రోగం చిన్నదైనా.. వైద్యం పెద్దగానే ఉంటుంది. రోగానికి మూలాన్ని శోధించి, పరిశోధించి పట్టుకోవాల్సిందే.  ఒళ్ళు గుల్ల,  జేబు డొల్ల అయ్యేవరకు రోగ మూలాలను పట్టుకునే ప్రయత్నం సాగుతూనే.. ఉంటుంది. ఇక బ్రతకటం కష్టమేమో అన్నప్పుడు.. వెంటిలేటర్ ఎక్కించేస్తారు. ఇక మా వల్ల కాదు మహాప్రభో.. ఆస్తులు కరిగిపోయాయి. అప్పు పుట్టడం లేదు.. అని మొత్తుకోవాలి.  అప్పుడు వెంటిలేటర్ దించు పాడె కెక్కిస్తారు.
అయినా వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. పాపం వాళ్ళు శవాలకు కూడా మూడు నాలుగు రోజులు వైద్యం చేసి బ్రతికించి.. బట్ట కట్టించాలనే చూస్తారు.
ఇక విద్య అయినా వైద్యమైనా..
వ్యాపారం అన్నాక ఓ లక్ష్యం పెట్టుకోక తప్పదు.  ఆ లక్ష్యాలకు మనం పావులం అవ్వకా తప్పదు.  
హతవిధీ.. ఈ బ్రతుకు బ్రతకవలసిందే..
-శాంతిప్రియ దినవహి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular