తన తండ్రి, దివంగత నేత వైఎస్ కలల ప్రాజెక్టు వెలిగొండను పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, రెండో టన్నెల్ పనులు యుద్ధప్రాతిపదికలో జరుగుతున్నాయని, రెండో టన్నెల్ పనుల కోసం మొదటి టన్నెల్ ను వినియోగిస్తున్నామని, 2022 ఆగస్టు నుంచి మొదటి టన్నెల్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు రైతాంగానికి అందిస్తామని వెల్లడించారు. రెండో టన్నెల్ పనులను 2023 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి మరో తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత ప్రారంభోత్సవంలో భాగంగా ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్ పాల్గొన్నారు. ఒంగోలు నగరానికి ప్రతిరోజూ ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం 400 కోట్ల రూపాయల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.
మహిళాభ్యుదయానికి, సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో యాభై శాతం మహిళలకు కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేశామని, ఉప ముఖ్యమంత్రిగా ఒక గిరిజన మహిళకు, హోం మంత్రిగా మహిళకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. ఎమ్మెల్సీలుగా ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చామని, చరిత్రలో తొలిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఒక మహిళను నియమించామని సిఎం వెల్లడించారు.
నామినేటెడ్ పదవుల్లో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లో 53 శాతం మహిళలకు కేటాయించామని, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఛైర్మన్లు, మేయర్ పదవుల్లో సగభాగానికి పైగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు 13మందిలో ఏడుగురు, 26మంది జడ్పీ వైస్ ఛైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలే ఉన్నారని సిఎం చెప్పారు. మహిళల పట్ల తనకు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్, ఒంగోలు మేయర్ పదవుల్లో కూడా మహిళలే ఉన్నారంటూ వారికి అభినందనలు తెలిపారు. అడుగడుగునా మహిళా పక్షపాతం చూపిస్తున్న తమ ప్రభుత్వానికి దేవుడు ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని సిఎం ఆకాంక్షించారు.