రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు హైదరాబాద్ లో భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మన ఊరు-మన బడి పథకాన్ని (పట్టణాల్లో మన బస్తి-మన బడి) అమలు చేస్తున్నది. దీనిద్వారా రాష్ట్రంలో ఉన్న 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించనున్నారు.
దశల వారిగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచనున్నారు. తొలి దశలో భాగంగా 9 వేలకుపైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించింది.
Also Read : ప్రభుత్వ విద్య బలోపేతానికే మన ఊరు మన బడి