Can Congress rebuild its glory ?
కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత.
కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప, స్వభావాలు, గుణ గణాలు చెబితే అర్థమయ్యేవి కావు. రాయబోతే మాటలకు దొరికేవి కావు. అది అనుభవైకవేద్యం.
తనకే తెలియనంత చరిత్ర కాంగ్రెస్ ది. నిజానికి కాంగ్రెస్ ను స్థాపించింది హ్యూమ్. ఓం ప్రథమంలో విదేశీ బీజంతోనే కాంగ్రెస్ పురుడు పోసుకుంది. అప్పటి నుండి దానికి విదేశీ బొడ్డు తాడు ఊడకుండా ఉండిపోయింది.
దేశం, కాలం సాపేక్షకం. మన అందరిళ్లల్లో ఇటాలియన్ మార్బుల్ తప్పనిసరి. అదొక హోదా. అందం. అలాగే కాంగ్రెస్ ఆఫీసులో కూడా ఇటాలియన్ మార్బుల్స్ చక్కగా కుదిరినట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కు ప్రపంచంలో ఇటలీ పెట్టింది పేరు. అలా కాంగ్రెస్ కు ఇటలీ ఇంటీరియర్ చక్కగా అమరినట్లుంది.
ఒక దుర్ముహూర్తాన ఇటాలియన్ మార్బుల్ ను, ఇటలీ ఇంటీరియర్ ను గుజరాత్ మార్బుల్స్ ఆక్రమిస్తాయి. ఇక అప్పటినుండి కాంగ్రెస్ కు కష్టాలు చెప్పే వస్తాయి. డెబ్బయ్, ఎనభై ఏళ్లు నిండినవారి మీద పందెం కాస్తూ అంతులేని రాజ శోకాన్ని, మధ్యలో నాథుడు లేని ప్రదేశాన్ని ఏలుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతూ ఉంటుంది.
తన జ్యోతి చేతిలో వెలగదని గ్రహించిన యువ ఆదిత్యులు కమలంలో వెలుగులు వెతుక్కుని ఆరోగ్యంగా తోచిన కాషాయ కషాయం తాగుతుంటారు. అయినా చేతికి ఇంకా వేళ్లు మిగిలి ఉన్నట్లు-చేతికి ఎముక లేనట్లు వృద్ధ జంబూకాలకే కాంగ్రెస్ వంత పాడుతూ ఉంటుంది. ఈలోపు విమానాన్ని నడపను పొమ్మని పైలట్లు అలిగి వెళ్ళిపోతుంటారు. పైలట్లు లేకుండా ఎన్నో రాష్ట్రాల్లో విమానాలను నడిపిన అనుభవం కాంగ్రెస్ ది. అలిగిన పైలట్లకు వాట్సాప్లో ఊస్టింగ్ ఆర్డర్లు పంపి- ఆటో పైలట్ మోడ్లో విమానాలను నడుపుతున్న ధైర్యం కాంగ్రెస్ ది. ఆ విమానాలు ఎక్కడ ల్యాండ్ అవుతాయో? ఎలా ల్యాండ్ అవుతాయో? ఎవరికీ అంతుపట్టదు. అందులో ప్యాసింజర్ల మీద కాంగ్రస్ కు కోపంకానీ, ద్వేషం కానీ ఉండవు. అలాగని అనురాగమూ ఉండదు.
కాంగ్రెస్ కు అన్నీ తెలుసు. అన్ని విద్యలూ వచ్చు. కానీ అధికారంలో ఉంటేనే దాని విద్యలు పనిచేస్తాయని పురుడు పోసినప్పుడు హ్యూమ్ పెట్టిన వరం లాంటి శాపం. శాపం లాంటి వరం. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అత్యంత సంపన్నులై ఉంటారు. పార్టీ మాత్రం కటిక దరిద్రం అనుభవిస్తూ ఉంటుంది.
రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ ది దేశ దృక్పథం. దేశం విషయంలో కాంగ్రెస్ ది అంతర్జాతీయ దృక్పథం. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష దృక్పథం. దాంతో ఏ స్థాయిలోను పునాదితో సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయడం కాంగ్రెస్ స్వభావం.
సకల రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ మాతృక. ఎదిగే తన పిల్లల పార్టీలు చూసి కాంగ్రెస్ అసూయ పడ్డం తప్ప ఏమీ చేయలేదు. కీలకమయిన విశ్వాస పరీక్షలు, బల నిరూపణలు, రిసార్టు రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ ఒంటికి బొత్తిగా పడ్డం లేదు. రిసార్టుల బిల్లులు కూడా కట్టలేని పేదరికంలో కాంగ్రెస్ బలం నిరూపణ కాకముందే విరూపం కావడం సహజం.ఎన్నో ఆటుపోట్లను చుసిన కాంగ్రెస్ కు ఒక పైలట్ పొతే వందల పైలట్లు దొరుకుతారు. ఈ రోజుల్లో పైలట్ ట్రయినింగ్ పూర్తీ చేసినవారే విమానం నడపాల్సిన అవసరం లేదు. యూ ట్యూబులో చూసి ఎవరయినా నడపవచ్చు. కొంచెం అవగాహన ఉంటే యూ ట్యూబులో చూడకుండా కూడా విమానం నడపవచ్చు.
కాంగ్రెస్ కు “పెద్దాపరేషన్” చేయాలని సీనియర్ నేతలు సూచిస్తూ ఉంటారు. ఈలోపు వారికి జరగాల్సిన చిన్న పెద్ద ఆపరేషన్లతో పార్టీ పెద్దాపరేషన్ సంగతే మరచిపోతుంటారు.
పాతికేళ్ల కిందటివరకు పెద్దాపరేషన్, పెద్దాసుపత్రి మాటలు వాడుకలో ఉండేవి. పెద్దాసుపత్రికి వెళ్లారంటే పెద్ద రోగమేదో వచ్చినట్లు. సహజంగా పెద్దాసుపత్రిలో జరిగేది పెద్దాపరేషనే అవుతుంది. పెద్ద అచ్చ తెలుగు మాట. ఆపరేషన్ ఇంగ్లీషు. రెండు వేరు వేరు భాషల మాటలయినా హాయిగా సువర్ణ దీర్ఘ సంధి కుదిరింది. ఆసుపత్రి ఐ సి యూ ల్లో ఏ భాష వ్యాకరణమయినా ప్రాణవాయువు గొట్టాలు ఎక్కించుకుని నోరు మూసుకుని పడుకోవాలే కానీ- మాట్లాడకూడదు.
రోగం, రోగలక్షణాలు, రోగ నిర్ధారణకు పరీక్ష, రోగం నయం కావడానికి వైద్యం- వేరు వేరు అంశాలు. రోగం రాకుండా జాగ్రత్తపడడం సర్వోత్తమం. జబ్బు చేయకుండా జాగ్రత్తపడడం కాంగ్రెస్ కు చేత కాదు. రోగ లక్షణాలు కనిపించినా కాంగ్రెస్ వైద్యుడిని సంప్రదించదు. రోగ పరీక్షలకు వెళ్ళదు. వెళ్లినా రోగాన్ని అంగీకరించదు. అంగీకరించినా మందులు వాడదు. వాడినా మందులు పనిచేయవు అనే నైరాశ్యం, నిస్పృహలు అణువణువునా ఉంటాయి కాబట్టి- పొరపాటున మందులు వాడినా అవి నిజంగానే పని చేయవు. కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయగలిగే పెద్దాసుపత్రి ఎక్కడుందో? ఉంటే ఆ పెద్దాపరేషన్ చేయగలిగే పెద్ద డాక్టర్ ఎవరో? కూడా సీనియర్లకు అంతు పట్టడం లేదు.
దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో ఎ ఐ సి సి ఆఫీస్ లో వచ్చినవారికి ఒక కప్పు వేడి చాయ్ ఇచ్చేందుకు కూడా దాని దగ్గర డబ్బులుండవు.
ఆసేతు హిమాచలం రాష్ట్రాల్లో కాంగ్రెస్ తనతో తానే విభేదిస్తూ, తనతో తానే గొడవ పడుతూ, తన తల తనే గోడకేసి కొట్టుకుంటూ బిజీగా ఉంటుంది. తాజాగా పంజాబ్ లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరి వైపో అధిష్ఠానానికే క్లారిటీ లేదు. అక్కడి ముఖ్యమంత్రి- పి సి సి ప్రెసిడెంట్ లు అమరిందర్- సిద్ధులకు కూడా క్లారిటీ లేదు.పార్టీని ఎలా నడపకూడదో అన్నదానికి ఆధునిక కాలంలో కాంగ్రెస్సే పెద్ద ఉదాహరణ. నిజానికి కాంగ్రెస్ అవసరం దేశానికి ఉంది. కాకపోతే కాంగ్రెస్ కే ఈ దేశంతో అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు.
A large formal meeting is called Congress- అన్నది నిఘంటువు అర్థం. ఆ కోణంలో ప్రస్తుత కాంగ్రెస్ ది సార్థక నామధేయమే. అది ఎంత లార్జో దానికే తెలియదు. అధికారంలో ఉంటే అది అధికార కాంగ్రెస్. అధికారంలో లేకుంటే అది అనధికార కాంగ్రెస్. అధికారంలో ఉన్నా- లేకున్నా అది ధిక్కార కాంగ్రెస్. ఇంతకంటే ఇంకా కాంగ్రెస్ స్వరూప, స్వభావ, గుణ గణాల మీద లోతుగా వివరాలు తెలుసుకోదలిచినవారు పంజాబ్ కు వెళ్లి సిద్ధూను సంప్రదించగలరు. రాజస్థాన్ కు వెళ్లి పైలట్ తో మాట్లాడగలరు. అదీ కుదరకపోతే మీకు దగ్గర్లోని ఏదయినా పి సి సి లేదా డి సి సి ఆఫీసుకు వెళ్లగలరు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read: ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?
Also Read: ఏడిస్తే నీ కళ్లు ఎరుపెక్కుతాయి!