Wednesday, February 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయాలట!

కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయాలట!

కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత.

కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప, స్వభావాలు, గుణ గణాలు చెబితే అర్థమయ్యేవి కావు. రాయబోతే మాటలకు దొరికేవి కావు. అది అనుభవైకవేద్యం.

తనకే తెలియనంత చరిత్ర కాంగ్రెస్ ది. నిజానికి కాంగ్రెస్ ను స్థాపించింది హ్యూమ్. ఓం ప్రథమంలో విదేశీ బీజంతోనే కాంగ్రెస్ పురుడు పోసుకుంది. అప్పటి నుండి దానికి విదేశీ బొడ్డు తాడు ఊడకుండా ఉండిపోయింది.

దేశం, కాలం సాపేక్షకం. మన అందరిళ్లల్లో ఇటాలియన్ మార్బుల్ తప్పనిసరి. అదొక హోదా. అందం. అలాగే కాంగ్రెస్ ఆఫీసులో కూడా ఇటాలియన్ మార్బుల్స్ చక్కగా కుదిరినట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కు ప్రపంచంలో ఇటలీ పెట్టింది పేరు. అలా కాంగ్రెస్ కు ఇటలీ ఇంటీరియర్ చక్కగా అమరినట్లుంది.

ఒక దుర్ముహూర్తాన ఇటాలియన్ మార్బుల్ ను, ఇటలీ ఇంటీరియర్ ను గుజరాత్ మార్బుల్స్ ఆక్రమిస్తాయి. ఇక అప్పటినుండి కాంగ్రెస్ కు కష్టాలు చెప్పే వస్తాయి. డెబ్బయ్, ఎనభై ఏళ్లు నిండినవారి మీద పందెం కాస్తూ అంతులేని రాజ శోకాన్ని, మధ్యలో నాథుడు లేని ప్రదేశాన్ని ఏలుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతూ ఉంటుంది.

తన జ్యోతి చేతిలో వెలగదని గ్రహించిన యువ ఆదిత్యులు కమలంలో వెలుగులు వెతుక్కుని ఆరోగ్యంగా తోచిన కాషాయ కషాయం తాగుతుంటారు. అయినా చేతికి ఇంకా వేళ్లు మిగిలి ఉన్నట్లు-చేతికి ఎముక లేనట్లు వృద్ధ జంబూకాలకే కాంగ్రెస్ వంత పాడుతూ ఉంటుంది. ఈలోపు విమానాన్ని నడపను పొమ్మని పైలట్లు అలిగి వెళ్ళిపోతుంటారు. పైలట్లు లేకుండా ఎన్నో రాష్ట్రాల్లో విమానాలను నడిపిన అనుభవం కాంగ్రెస్ ది. అలిగిన పైలట్లకు వాట్సాప్లో ఊస్టింగ్ ఆర్డర్లు పంపి- ఆటో పైలట్ మోడ్లో విమానాలను నడుపుతున్న ధైర్యం కాంగ్రెస్ ది. ఆ విమానాలు ఎక్కడ ల్యాండ్ అవుతాయో? ఎలా ల్యాండ్ అవుతాయో? ఎవరికీ అంతుపట్టదు. అందులో ప్యాసింజర్ల మీద కాంగ్రస్ కు కోపంకానీ, ద్వేషం కానీ ఉండవు. అలాగని అనురాగమూ ఉండదు.

కాంగ్రెస్ కు అన్నీ తెలుసు. అన్ని విద్యలూ వచ్చు. కానీ అధికారంలో ఉంటేనే దాని విద్యలు పనిచేస్తాయని పురుడు పోసినప్పుడు హ్యూమ్ పెట్టిన వరం లాంటి శాపం. శాపం లాంటి వరం. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అత్యంత సంపన్నులై ఉంటారు. పార్టీ మాత్రం కటిక దరిద్రం అనుభవిస్తూ ఉంటుంది.

రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ ది దేశ దృక్పథం. దేశం విషయంలో కాంగ్రెస్ ది అంతర్జాతీయ దృక్పథం. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష దృక్పథం. దాంతో ఏ స్థాయిలోను పునాదితో సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయడం కాంగ్రెస్ స్వభావం.

సకల రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ మాతృక. ఎదిగే తన పిల్లల పార్టీలు చూసి కాంగ్రెస్ అసూయ పడ్డం తప్ప ఏమీ చేయలేదు. కీలకమయిన విశ్వాస పరీక్షలు, బల నిరూపణలు, రిసార్టు రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ ఒంటికి బొత్తిగా పడ్డం లేదు. రిసార్టుల బిల్లులు కూడా కట్టలేని పేదరికంలో కాంగ్రెస్ బలం నిరూపణ కాకముందే విరూపం కావడం సహజం.

ఎన్నో ఆటుపోట్లను చుసిన కాంగ్రెస్ కు ఒక పైలట్ పొతే వందల పైలట్లు దొరుకుతారు. ఈ రోజుల్లో పైలట్ ట్రయినింగ్ పూర్తీ చేసినవారే విమానం నడపాల్సిన అవసరం లేదు. యూ ట్యూబులో చూసి ఎవరయినా నడపవచ్చు. కొంచెం అవగాహన ఉంటే యూ ట్యూబులో చూడకుండా కూడా విమానం నడపవచ్చు.

కాంగ్రెస్ కు “పెద్దాపరేషన్” చేయాలని సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ సూచించారు. ఉత్తర ప్రదేశ్ లో పేరున్న నాయకుడు, రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్యుడు అయిన జితిన్ ప్రసాద కాంగ్రెస్ చేయి వదిలి, కాషాయ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా మొయిలీ పెద్దాపరేషన్ ప్రస్తావన తెచ్చినట్లున్నారు.

పాతికేళ్ల కిందటివరకు పెద్దాపరేషన్, పెద్దాసుపత్రి మాటలు వాడుకలో ఉండేవి. పెద్దాసుపత్రికి వెళ్లారంటే పెద్ద రోగమేదో వచ్చినట్లు. సహజంగా పెద్దాసుపత్రిలో జరిగేది పెద్దాపరేషనే అవుతుంది. పెద్ద అచ్చ తెలుగు మాట. ఆపరేషన్ ఇంగ్లీషు. రెండు వేరు వేరు భాషల మాటలయినా హాయిగా సువర్ణ దీర్ఘ సంధి కుదిరింది. ఆసుపత్రి ఐ సి యూ ల్లో ఏ భాష వ్యాకరణమయినా ప్రాణవాయువు గొట్టాలు ఎక్కించుకుని నోరు మూసుకుని పడుకోవాలే కానీ- మాట్లాడకూడదు.

రోగం, రోగలక్షణాలు, రోగ నిర్ధారణకు పరీక్ష, రోగం నయం కావడానికి వైద్యం- వేరు వేరు అంశాలు. రోగం రాకుండా జాగ్రత్తపడడం సర్వోత్తమం. జబ్బు చేయకుండా జాగ్రత్తపడడం కాంగ్రెస్ కు చేత కాదు. రోగ లక్షణాలు కనిపించినా కాంగ్రెస్ వైద్యుడిని సంప్రదించదు. రోగ పరీక్షలకు వెళ్ళదు. వెళ్లినా రోగాన్ని అనికరించదు. అంగీకరించినా మందులు వాడదు. వాడినా పనిచేయదు అనే నైరాశ్యం, నిస్పృహలు అణువణువునా ఉంటాయి కాబట్టి- పొరపాటున మందులు వాడినా అవి నిజంగానే పని చేయవు. కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయగలిగే పెద్దాసుపత్రి ఎక్కడుందో? ఉంటే ఆ పెద్దాపరేషన్ చేయగలిగే పెద్ద డాక్టర్ ఎవరో? కూడా వీరప్ప మొయిలీ చెబితే బాగుండేది.

అధికారంలో ఉంటే కాంగ్రెస్ ది- భోగం.
అధికారం లేకుంటే కాంగ్రెస్ ది- రోగం.
అది వైద్యానికి లొంగని రాజకీయ లోభ మోహ మద మాత్సర్య రోగం!

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : కాంగ్రెస్‌లో తాత్కాలిక విరామ సంగీతం..!

RELATED ARTICLES

Most Popular

న్యూస్