టాలీవుడ్ లో సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. తమిళంలో మాత్రం రెండు సినిమాలు థియేటర్లకు వచ్చాయి. ఒకటి ధనుశ్ సినిమా అయితే .. మరొకటి శివకార్తికేయన్ సినిమా. ధనుశ్ హీరోగా చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ఈ నెల 12వ తేదీన అక్కడ భారీస్థాయిలో విడుదలైంది. డిఫరెంట్ లుక్ .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ధనుశ్ చేసిన ఈ సినిమా, అక్కడి థియేటర్స్ లో రన్ అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో రూపొందడం ఈ సినిమా ప్రత్యేకత.
ఇక అదే రోజున శివకార్తికేయన్ సినిమా ‘అయలాన్’ అక్కడి థియేటర్లకు వచ్చింది. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రకుల్ కనిపించింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, చాలా వేగంగా 50 కోట్ల మార్క్ ను టచ్ చేయడం విశేషం. భూమి మీదకు వచ్చిన ఒక గ్రహాంతరవాసితో హీరోకి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? అనేది ఈ సినిమా కథ. కంటెంట్ లోని కొత్తదనమే ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షాన్ని కురిపిస్తోంది.
ఇప్పుడు ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ఈ నెల 25వ తేదీన ఇక్కడి థియేటర్లకు రానుంది. ఇక ఒక రోజు తేడాతో 26వ తేదీన ‘అయలాన్’ ఇక్కడ విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాలు ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో, ఏ స్థాయి వసూళ్లను దక్కించుకుంటాయనేది చూడాలి. కోలీవుడ్ లో ‘కెప్టెన్ మిల్లర్’ కంటే వసూళ్ల విషయంలో ‘అయలాన్’ ముందుండటం విశేషం.