Saturday, January 18, 2025
HomeTrending Newsకౌంటింగ్ ఏజెంట్ వ్యాఖ్యలు: సజ్జలపై కేసు నమోదు

కౌంటింగ్ ఏజెంట్ వ్యాఖ్యలు: సజ్జలపై కేసు నమోదు

వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదు చేశారు.

బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడానికి రాలేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లు కూర్చోవాలని సూచించారు.  కౌంటింగ్ ఏజెంట్స్.. రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లు రావద్దన్న అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. బుధవారం రాత్రినుంచి సామాజిక మాధ్యమాల్లో సజ్జల వీడియో వైరల్ అయ్యింది.

దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  తాము చెబుతున్నట్లుగానే కౌంటింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లకు, ఘర్షణకు పాల్పడేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని… సజ్జల వ్యాఖ్యలు దీనికి ఊతమిచ్చేలా ఉన్నాయని మండిపడింది. దీనిపై టిడిపి నేత దేవినేని, పార్టీ లాయర్ ఇద్దరూ కలిసి తాడేపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓడిపోతామనే భయంతో ఒక కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడడానికి ఈ కుతంత్రాలకు తెరలేపారని ఉమా ఆరోపించారు. వెంటనే కేసు బుక్ చేసి సజ్జలను అరెస్టు చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఫిర్యాదులో కోరినట్లు మీడియాకు వివరించారు. టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు పై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్