Cases Registered Against Bjp And Trs Leaders :
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఐకెపి కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించే క్రమంలో, టిఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అదే క్రమంలో బిజెపి నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుండి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకెపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుండి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు
బండి సంజయ్ పర్యటన నేపధ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు,రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపద్యంలో బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.
Also Read : అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు