Friday, November 22, 2024
HomeTrending Newsతెలంగాణలో కులగణనకు శ్రీకారం

తెలంగాణలో కులగణనకు శ్రీకారం

రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న బిసిల చిరకాల డిమాండ్ ఆచరణలోకి రాబోతోంది. శాసభసభ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు  కులగణనపై ప్రభుత్వం తీర్మానం ప్ర‌వేశ‌పెట్టగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ కుల గణనపై ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో బీసీ గ‌ణ‌న చేప‌డ‌తున్న‌ట్లు పేర్కొన్నారు.

బీసీ కులగణనపై బీఆర్ఎస్ కొన్ని సందేహాలు లేవనెత్తింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… బీసీ కులగణనపై తీర్మానం కాదు.. చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు కులగణన చేస్తే.. బీసీ కులాలే నష్టపోతాయన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలన్నారు. కులగణన ఏవిధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలన్నారు. కులగణన అని జనాభా గణన అని ప్రభుత్వం వివిధ రకాల పదాలు వాడుతోందని స్పష్టత ఇవ్వాలని ఎమెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు సిద్డంకాగా.. ఇప్పటికే మంత్రివర్గం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలో కెసిఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా ఆ వివరాలు వెల్లడించలేదు. దీంతో 130 కులాల బిసిల్లో అనుమానాలు రేకెత్తాయి. జనాభాలో దామాష పద్దతిలో బిసిలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తొమ్మిదన్నర ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 23వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. MBCలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు ఖర్చుచేయలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో బిసి సబ్ ప్లాన్ తీసుకొస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కుల గణన తర్వాత ఆయా వర్గాల కోసం ఎవరు ఉహించని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

జనాభాలో అర శాతం ఉన్న వారికి కులగణనతో బాధ ఉంటుందని… బాదితులుగా ఉన్నవారిని పాలకులను చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

కేంద్రం కులగణనకు సిద్ధంగా లేకపోవడంతో ఇప్పటికే బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణను చేపట్టాయి. ఆ జాబితాలో ఇప్పుడు తెలంగాణ చేరబోతోంది. బిసిల కులగణన చేపట్టినట్లైతే జనాభా దామాషా ప్రకారం వారికి వాటా దక్కనుంది. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం తెలిసిందే. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పరిమితం కావడంతో బిసిల జనాభా కులాల లెక్కలు తీస్తే వారి జనాభా కనుగుణంగా అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని బిసిలు సుధీర్గ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తున్నారు. కులగణన వల్ల చట్టసభల్లో 50 శాతానికి పైగా బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఉద్యోగాల్లోనే గాకుండా రాజకీయాల్లోనూ బిసిలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లుదక్కాలనేది బిసి సంఘాల డిమాండ్. 56 శాతం బిసి జనాభా ఉందని బిసి సంఘాలు పేర్కొంటున్నాయి. కుల గణన వల్ల స్థానిక సంస్థలతోపాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం దక్కుతాయని భావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్