Friday, November 22, 2024
HomeTrending NewsCaste Politics-2: తెలంగాణ నేతలు... కుల రాజకీయాలు

Caste Politics-2: తెలంగాణ నేతలు… కుల రాజకీయాలు

దొరలు, పటేళ్ళ ప్రాపకం లేకుండా నిమ్న వర్గాల నేతలు రాజకీయలలో నెగ్గుకు రావటం వర్తమానంలొ దుర్లభమనే చెప్పాలి.  వ్యక్తిగా, నాయకుడిగా పేరున్నా అంగ, అర్థ బలం కలిగిన పెద్దవాళ్ళ సహకారం తప్పనిసరి. పార్టీల వారిగా కులాలు, నేతలు..వారి వ్యవహార శైలి పరిశీలిస్తే వివిధ అంశాలు గోచరిస్తాయి.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కులం కార్డు విషయంలో కొంత గుంబనంగా వ్యవహరిస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు డీకే అరుణతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి…రెడ్డీలు అధికారంలో ఉన్నపుడు రెడ్డీలకు మేలు చేయటంలో తప్పు ఏముందని అన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నారు. పిసిసి అధ్యక్షుడు అయ్యాక తన వర్గంలో అన్ని కులాల వారు ఉండేట్టుగా సర్దుకున్నారు.

ఈ దఫా కాంగ్రెస్ రాకుంటే రాజకీయంగా అధోగతి అని రెడ్డి వర్గం కీలక నేతలు చేమటోడుస్తున్నారు. యువత దగ్గర నుంచి మహిళల వరకు అధికార పార్టీని తిట్టి పోస్తున్నారు. నేతల సంగతి సరే సరి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రెడ్డి కులస్తులలో ఈ భావన అధికంగా ఉంది.

సిఎం కెసిఆర్ సమర్థతకు ప్రాధాన్యత ఇచ్చినా కింది స్థాయిలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ప్రజానేతగా కెసిఆర్ అందరిని ఆదరిస్తారు. తన మన భేదం లేకుండా ఆయన అనుచర వర్గం ఉంటుంది. ఈ సుగుణాలతోనే కెసిఆర్ తెలంగాణలో తిరుగులేని నేతగా నిలబడ్డారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలతో పోలిస్తే తండ్రికి తగిన తనయుడుగా మంత్రి కేటిఆర్ నైజం ఉంటుందని పార్టీ నేతలు, అధికార వర్గాలు చెప్పుకుంటాయి.

సిఎం కెసిఆర్ అందరి వాడైతే మరి క్షేత్రస్థాయిలో సమీకరణాలు ఎందుకు విరుద్దంగా ఉన్నట్టు. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక.  తొలినాళ్ళలో బిసి నేతలను కెసిఆర్ ప్రోత్సహించినా… అవకాశాల్ని అందిపుచ్చుకోలేక పోయారని విశ్లేషకులు అంటారు.  కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాల వారిని ఆదరించినందుకే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆ ట్యాగ్ వదిలించుకున్నందునే ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారు. అది నిలబెట్టుకోవల్సిన  అవసరం ఉంది.

నేతల వైఖరి అలా ఉంటే ఇక కులం సంగతికొద్దాం.. ఇటీవలి వరకు ఉత్తర తెలంగాణ నుంచి అమాత్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఓ మంత్రి పేషీలో ఒక కులం వారే పెత్తనం సాగించారని వినికిడి. ఆ మంత్రి నియోజకవర్గంలో ఏది జరగాలన్నా… మంత్రిని ఎవరు కలవాలన్నా వీరి ప్రమేయంతో జరగాల్సిందే.

వేములవాడలో తుల ఉమ పేరు ప్రకటించి చివరి నిమిషంలో చెన్నమనేని వికాస్ కు బిజెపి సీటు ఖాయమైంది. నారాయణ్ ఖేడ్ లో సురేష్ షెట్కార్ ను కాదని సంజీవ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఎవరైనా అడిగితే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం అంటారు. మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న బిసి నేత జానయ్య కారు దిగి ఏనుగు ఎక్కటంతో సూర్యాపేటలో కొంత ఎదురుగాలి ఉందని సమాచారం.

చంద్రబాబు అరెస్టు అయితే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అందులో పాల్గొన్న వారు ఎవరని ఆరా తీస్తే అధిక శాతం ఆయన సామాజికవర్గం వారే. తమ బాధ ప్రపంచ బాధ అన్నట్టుగా బాబుకు బెయిల్ వచ్చే వరకు ఆందోళనలు విరమించ లేదు. తెలంగాణలో రెండు మూడు జిల్లాల్లో మాత్రమే ఉన్నా రాజకీయాలను ప్రభావిత చేసే కమ్మ సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో హవా కొనసాగించింది. తెలంగాణ వచ్చాక వారి ప్రాబల్యం మరింత పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నవే మూడు జనరల్ స్థానాలు కాగా ఆ మూడింటిలో వీరిదే పెత్తనం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ జిల్లాలో తమ మాట నెగ్గాలనే విధంగా కమ్మదనమైన ఖమ్మం రాజకీయాలు ఉంటాయి. కూకట్ పల్లిలో పాగా వేసేందుకు దండయాత్ర చేస్తున్నారు.

రెండు కులాల పోలికలు అందరికి వర్తించవు. ఇందుకు విరుద్దంగా వైరి వర్గంలో వీరవిదేయులుగా పేరుతెచ్చుకున్న నేతలు ఉన్నారు. మెజారిటీగా జరుగుతున్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే ప్రధాన పార్టీలు తమ ఉనికి కాపాడుకునేందుకు ఈ వైరుధ్యాలను ఎగదోస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్