Friday, October 18, 2024
HomeTrending Newsమేం తప్పు చేయం - అప్పు చేయం: లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

మేం తప్పు చేయం – అప్పు చేయం: లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

ఐపీఎస్ విశ్రాంత అధికారి, గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన వివి లక్ష్మీనారాయణ ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘జై భారత్ నేషనల్ పార్టీ’ గా నామకరణం చేశారు. అన్ని వర్గాలను కలిసి, వారి అభిప్రాయాలను, ఆశయాలను పరిగణన లోకి తీసుకొని ఈ నూతన రాజకీయ వేదిక స్థాపించినట్లు వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీని ప్రకటిస్తూ జెండా, అజెండా విడుదల చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని… హోదా వద్దు ప్యాకేజీ వద్దు అంటూ ఓ పార్టీ; మేడలు వంచి హోదా తెస్తామని మరో పార్టీ  మోసం చేసిందని ఆరోపించారు. అవినీతిని అంతమొందించడం, అభివృద్ధి సాధించడం ద్వారా ప్రజల అవసరాలు తీర్చడం తమ విధానాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, అవినీతి విషయంలో రెండు ప్రధాన పార్టీలో ఒకే తరహాలో ఉన్నాయని, వారు తిన్నారని వీళ్ళు, వీళ్ళు తిన్నారని వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని లక్ష్మీనారాయణ పరోక్షంగా టిడిపి, వైసీపీలపై విమర్శలు చేశారు. ప్రజలకు బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తామని, రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అప్పు చేయదని, తప్పు కూడా చేయదని ప్రకటించారు.

సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పార్టీకి శ్రీకారం చుట్టామని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుటుంబ పాలన చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నారు. డాలర్ శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేస్తోందని, మేధావులను- ఆర్ధికవేత్తలను ఉక్కు పాదాల కింద తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్