Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశుభం పలకరా పెళ్ళికొడకా! అంటే...!

శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే…!

శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే ఆ పెళ్ళికొడుకు అనకూడని మాట అనడంతో జరగకూడని అనర్థం జరిగిందని అనాదిగా సామెత చెబుతూనే ఉంది. భారతదేశంలో అత్యంత సంపన్నుల ఇళ్ళల్లో పెళ్ళి నిశ్చయమైనప్పుడే…ఒకవేళ విడాకులు తీసుకుంటే పంపకాలకు సంబంధించి కూడా ఒక మాట అనుకుని…ఆ ఒప్పందాన్ని రిజిస్టర్ చేయిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలున్న కుటుంబాల్లో సంసారం సజావుగా సాగితే పరవాలేదు కానీ…మనస్పర్ధలొచ్చి భార్యాభర్తలు విడిపోతే కంపెనీ ఆస్తులను కూడా విభజించాల్సి వస్తోంది. దాంతో దశాబ్దాల కంపెనీలు రోడ్డున పడుతున్నాయి. బ్రాండ్ విలువ పోతోంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం పోతోంది. చివరకు కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.

ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు భారత ఆదాయప్పన్ను శాఖవారి లెక్కలప్రకారం అయిదున్నరవేల కోట్ల సంపద ఉంది. మొదట ఒక పెళ్ళయ్యింది. కొంతకాలం కాపురం చేశాక మనస్పర్ధలొచ్చాయి. పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టుద్వారా లీగల్ గా విడిపోయారు. ఆ సందర్భంగా భరణంగా మాజీ భార్యకు మాజీ భర్త 500 కోట్లు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. ఇంత సంపద ఉన్నా ఏదో వెలితి అని…మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కర్మ ఎందుకో బలంగా కాలి…రెండో పెళ్ళిలో వేసిన మూడు ముళ్ళు కూడా గట్టిగా నిలబడక వదులుగా జారిపోయాయి. పూర్వానుభవం ఎలాగూ ఉంది కాబట్టి…అలాగే పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టుద్వారా లీగల్ గా విడిపోదాం అన్నాడు. ఆమె అడ్డం తిరిగింది. మొదటామె అమాయకురాలు కాబట్టి నీ 5,500 కోట్లలో 500 కోట్లు భరణంగా ఇస్తే సరేనని మౌనంగా తలవంచుకుని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టింది…నేనలా కాదు…అర్ధాంగిగా నాకు నీ ఆస్తిలో అర్ధభాగం అంటే 2,750కోట్లు ఇస్తేనే సంతకం పెడతాను అని పేచీ పెట్టింది. స్థానిక కోర్టు, హై కోర్టు దాటి కేసు సుప్రీం కోర్టు దాకా తెగ తీగసాగింది.

ఈ కేసు విన్న న్యాయమూర్తులకు చిర్రెత్తుకొచ్చింది. ఈమధ్య చాలామంది మహిళలు భరణంగా ఇలాగే సగం లెక్కలు వేసి అడుగుతున్న విషయం గుర్తొచ్చింది. ప్రత్యేకించి ఈ కేసులో మొదటామెకు ఇచ్చినట్లు 500కోట్లు అడిగినా బహుశా న్యాయమూర్తులు ఇంత ఇదయి ఉండేవారు కాదేమో! 2,750కోట్ల భరణమా! ఏం వేళాకోళంగా ఉందా? వేల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? అడగడానికయినా ఒక హద్దుండద్దా! అని క్లాసు తీసుకున్నారు.

విడిపోయిన తరువాత తనమానాన తను గౌరవంగా, ఆర్థికంగా ఇబ్బందిపడకుండా సహేతుకమైన జీవనప్రమాణంతో బతకడానికి ఇచ్చేదే భరణం కానీ…మాజీ జీవిత భాగస్వామితో సమానంగా ఆర్థిక స్థితి కల్పించడం కాదని సర్వోన్నత న్యాయమూర్తులు కుండ బద్దలుకొట్టినట్లు స్పష్టంగా చెప్పారు.

ఆమెకు భరణంగా 12 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని తీర్పునిస్తూ…అతడిపై ఆమె పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను కూడా కొట్టేశారు. (ఆమె కోర్టుకెక్కకపోయి ఉంటే 500కోట్లు వచ్చేవేమో పెరుమాళ్ళకే ఎరుక!)

ఇలాంటి కేసులన్నీ వినీ వినీ సంపన్న పారిశ్రామికవేత్తలు నిశ్చితార్థమప్పుడే శుభ ప్లస్ అశుభం కలిపి సవర్ణదీర్ఘసంధిగా శుభాశుభాలు రెండూ ఓపెన్ గా, స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు.

  • ఈ పెళ్ళి పెటాకులైతే భరణంగా నీకు దక్కేది ఇంతే అని కాగితం మీద లెక్కలు రాసి చూపిస్తున్నారు. అంతకుమించి అడగను అని అమ్మాయి/అబ్బాయి చేత ముందే ఒప్పందపత్రాలమీద సంతకాలు చేయించుకుని వాటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ కూడా చేయిస్తున్నారు. (ఇంట్లో, కంపెనీ బోర్డు మీటింగుల్లో బోర్డులుగా కూడా పటం కట్టి వేలాడదీస్తున్నారేమో!)
  • ఈ పెళ్ళి జరిగి…పిల్లలు పుట్టి…విడిపోతే…పిల్లల పోషణ, వారికి ఆస్తిలో వాటాల లెక్కలు కూడా నిశ్చితార్థం రౌండ్ టేబుల్ మీదే సుహృద్భావ వాతావరణంలో ఇరుపక్షాలవారు నీళ్ళునమలకుండా మాట్లాడుకుని…అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు.
  • విడిపోతే సొంత ఆస్తుల్లో తప్ప కంపెనీల ఆస్తుల్లో వాటా అడగను అని మరికొంతమంది ఉదారంగా వ్యవహరిస్తున్నారు.
  • ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్లలా ఆఫ్టర్ డైవోర్స్ సెటిల్మెంట్ అడ్వైజర్ల కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. చేతులు కాలాక విడాకులు పట్టుకుని ప్రయోజనం లేదన్న ఎరుకతో…చేయి చేయి కలవక ముందే…కొంగూ కొంగూ ముడివేయక ముందే…అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవకముందే…సంసారంలో అగ్గి రాజుకుని…ఒక్కడుగు కూడా కలిసి నడవలేని సందర్భాన్ని ముందే అంచనా వేసి అన్ని ఏర్పాట్లు, రాతకోతలు చేసుకుంటున్నారు.
  • సంపన్నులు, పారిశ్రామికవేత్తల కుటుంబాల్లోనే కాదు. మొత్తం భారతీయ సమాజంలోనే విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా పెరుగుతుంది. దానికి కారణాల చర్చ ఇక్కడ అనవసరం.
  • మనసులు కలవనప్పుడు విడిపోతేనే నయమన్న వాదనకు అంగీకారం, ఆమోదం దొరుకుతోంది. విడిపోతే ఏమిటి? ఎలా? అన్నవి నిశ్చితార్థమప్పుడే మాట్లాడుకోవడం కూడా ఒక ఆచారంగా, లీగల్ ప్రొసీజర్ గా మారిన రోజుల్లో ఉన్నాం! బ్రేకప్ పార్టీలు ధూమ్ ధామ్ సెలెబ్రేషన్స్ గా జరుగుతున్నప్పుడు…ఎంగేజ్మెంట్ వేళ…పెళ్ళి పెటాకులైతే అన్న ముందు జాగ్రత్తతో చేసుకునే విడాకుల ఒప్పందాల కార్యక్రమాన్ని కూడా ధూమ్ ధామ్ గా, అధికారికంగా, లీగల్ గా, శాస్త్రీయంగా నిర్వహించుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలం?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి 
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular