Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమా పిల్లలు బంగారం

మా పిల్లలు బంగారం

Innocents: హైదరాబాద్ భాగ్యనగరం ఆదమరచి, గుర్రుపెట్టి నిద్రపోతున్న వేళ. అర్ధరాత్రి దాటి, తెల్లవారే వేళ అవుతున్నా…దయ్యాలు నిద్రలేచి పిచ్చిగా ఊగుతున్న వేళ. తెల్లవారడానికి ఇంకా మూడు గంటల సమయం ఉన్న మూడు గంటల వేళ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ సెల్ ఫోన్ విరామం లేకుండా మోగుతూనే ఉంది. ఏ కాల్ ను వదిలిపెట్టకుండా అన్నిటినీ ఆన్సర్ చేస్తున్నారు. సభామర్యాద, పెద్దల గౌరవాన్ని కాపాడాల్సిన గురుతరమయిన బాధ్యత ఒకటి మన నెత్తిన ఏడవడం వల్ల పేర్లు అనవసరం. సంభాషణల సారం మాత్రం గ్రహిద్దాం.

కమిషనర్:
హలో…ఎవరండీ? చెప్పండి ఈ వేళలో ఫోన్ చేశారు?

మొదటి పెద్ద మనిషి:
నేను సార్. మా అమ్మాయి లక్ష ఒత్తుల నోముకు సెవెన్ స్టార్ హోటల్ పూల్ సైడ్ కు వెళితే…చేతిలో ఒత్తుతున్న పత్తి ఒత్తులను…నైజీరియా మత్తు ఒత్తులనుకుని మీ వాళ్లు అరెస్ట్ చేశారట. ఉగాది రోజు మూడు పూటలా ఉగాది పచ్చడి తప్ప మా అమ్మాయి ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టుకోదు సార్. లక్ష ఒత్తుల నోము సెవెన్, ఫైవ్ స్టార్ హోటళ్లలో నోముకోకూడదా సార్? దిక్కులేని అక్కు పక్షుల్లా మా ఇళ్లల్లోనే నోముకోవాలా సార్? భర్త పత్తి వ్యాపారం పదికాలాలు పచ్చగా పత్తి పువ్వులా విచ్చుకోవాలని బ్రాహ్మీ ముహూర్తంలో భక్తితో చేతిలో పత్తి ఒత్తులు ఒత్తుకోవడం కూడా నేరమేనా సార్? అమ్మాయి తెల్లారేలోపు విశాఖ బంగాళా తీరంలో భీమిలీ వరుణ్ బీచ్ రిసార్ట్ లో కోటి ఒత్తుల నోముకు ప్రత్యేక విమానంలో వెళ్ళిపోవాలి. త్వరగా వదిలేయండి సార్.

మరో కాల్.

రెండో పెద్ద మనిషి:
నమస్తే సార్. బాగున్నరా? మా పోరడు బర్త్ డే కేక్ మీద వైట్ క్రీమ్ తింటుంటే మీ పోలీసోళ్ళు పట్టుకుపోయినారంట. వాడు ఇరవై ఏళ్లుగా ఇంజనీరింగ్ చదువుతున్న నిత్య విద్యార్థి సార్. వాడు నల్లగా ఉంటడు. దాంతో తెల్ల పొడి తింటే తెల్లగ అయితడని…తెల్లవి ఏవి కనపడినా తింటడు సార్. అంతే. జర జల్దీ…ఇడిసిపెట్టండి సార్.

మూడో పెద్ద మనిషి:
హలో నేను సార్. రాత్రిళ్లు వీధి కుక్కలకు రగ్గులు కప్పుతూ ఉంటాను. గుర్తు పట్టారా? మా అబ్బాయికి నిద్రలో నడిచే, పరుగెత్తే, డ్రయివింగ్ చేసే అలవాటు ఉన్నట్లు మీకు తెలుసు కదా? నిన్న రాత్రి నేను బొచ్చు కుక్కలకు రగ్గులు కప్పడానికి వెళ్లానో లేదో…వాడు నడుస్తూ, పరుగెత్తుతూ, కారు నడుపుకుంటూ పాడిసన్ పింక్ దాకా వెళ్లిపోయాడు. వాడు నిద్రలో ఉండగానే మీ వాళ్లు పట్టుకున్నారు. వాడు మేల్కొంటే లోకానికి అరిష్టం. నిద్రలో ఉండగానే వాడిని వదిపెట్టండి సార్.

నాలుగో పెద్ద మనిషి:
నమస్తే సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మా ఆస్తిలో సగం మీకు రాసిచ్చినా మీ రుణం తీరదు. అయిదేళ్లుగా కనిపించని మా ముద్దుల కొడుకును మీ పోలీసులు మ్యాడిసన్ మిణుకు మిణుకు మింక్ వెలుగులో పట్టుకున్నారు. మా పిచ్చి వెధవ మ్యాడ్ సన్ మ్యాడీసన్ మింక్ లో దొరకడంలో ఏదో యతిప్రాసల మైత్రి , ఆర్థోక్తి అలంకారం కూడా ఉన్నట్లుంది. ఒంటిమీద స్పృహలేకుండా, కళ్ళల్లో కాంతి లేకుండా, తల దువ్వుకోకుండా ఉన్న వాడిని టీ వీ వార్తల్లో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడో? మా దిష్టే తగిలేలా ఉంది. పిచ్చి వెధవ అన్నం మాని, సున్నం తింటున్నాడని తెలిసి గుండె తరుక్కుపోతోంది. వాడి ఆచూకీ కోసం ఈ ఐదేళ్లలో యాభై కోట్లు ఖర్చు పెట్టాం. మీరు చిటికెలో కనిపెట్టారు. మీరు గ్రేట్ సార్. ఇలాగే సంవత్సరం నుండి కనిపించని మా అమ్మాయిని కూడా రాత్రిళ్లు కన్నాలు వేసి సున్నాలు తినే ఇంకెక్కడో మింకుల్లోనో వెతికిపెట్టి పుణ్యం కట్టుకోండి సార్. చచ్చి మీ కడుపున పుడతాం. అయిదు వేల కోట్ల ఆస్తి. పిల్లా జెల్లా లేరు. అనుభవించే మూడో తరం పుట్టనే లేదు. అబ్బాయికి కోడలు విడాకులు ఇచ్చింది. అమ్మాయికి అల్లుడు విడాకులు ఇద్దామంటే అమ్మాయి ఏడాదిగా కనిపించక చస్తున్నాడు. ఇంటిగుమ్మంలో అల్లుడి బాధ చూడలేకుండా ఉన్నాం. పాపం.

అయిదు, ఆరు, ఏడు…నూరు…నూట ఇరవయ్యో పెద్ద మనుషులు:

కమిషనర్:
“మీరు చెప్పాల్సిన పనిలేదు. మీరేమి చెప్తారో నేనే చెప్తాను వినండి.
మీ పిల్లలు సత్యనారాయణ వ్రతానికి వెళ్లి…వ్రత కథ విని…హల్వా ప్రసాదం తింటుంటే…మా పోలీసులు అరెస్టు చేశారు. తడి బట్టలతో అటు నుండి అటే చాతుర్మాస్య వ్రతానికి వెళ్లాలి కాబట్టి వెనువెంటనే మేము విడిచి పెట్టాలి…”

పెద్ద మనుషులు:
అవును సార్. అక్షరాలా అంతే!

సన్యాసం తీసుకోవాలా? ఖాకీ డ్రెస్ వేసుకోవాలా? అని ఒక్క క్షణం కమిషనర్ కు ద్వైదీ భావం కలిగిన సందర్భమిది. ఈలోపు తూరుపు తెల్లారింది. పెద్దల పిల్లలు పబ్బుల్లో గబ్బు గబ్బు విన్యాసాలు, అరెస్టుల వార్తలు ఆగకుండా వస్తున్నాయి

సినిమాలో జంధ్యాల చెప్పినట్లు…
భోంచేసినప్పుడు ఒక జర్దా కిళ్లీ…
కిళ్లీ నములుతున్నప్పుడు ఒక సిగరెట్టు…
సిగరెట్టు కాలుస్తున్నప్పుడు ఒక బాటిల్…
బాటిల్ మూత ఓపెన్ చేసినప్పుడు జూదగృహాల వెంట వెళ్లడం…
వెళ్లినప్పుడు మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్ప ఏ ఇతర అలవాట్లు లేని ఒక కొత్త తరం పుట్టి, పెరిగి ఇప్పుడు వర్ధిల్లుతోంది. మత్తిల్లుతోంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్