సైకో వర్మ (వీడు తేడా) చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో ఆ చిత్ర దర్శకుడు నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని క్విటీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నట్టికుమార్ ఆగ్రహం వెలిబుచ్చారు. సెన్సార్ ద్వంద్వ విధానాలకు ఇదో ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. సైకో వర్మ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. గతంలో సైకో పేరుతో కొన్ని చిత్రాల టైటిల్స్ వచ్చాయని, వాటికి లేని అభ్యంతరం తమ చిత్రం టైటిల్ కు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నంచారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామని నట్టికుమార్ తెలిపారు.