Sunday, January 19, 2025
HomeTrending Newsపవన్ ఆందోళన కామెడీ: పేర్ని నాని

పవన్ ఆందోళన కామెడీ: పేర్ని నాని

Pawan protest is a comedy:
విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ కళ్యాణ్ ఆందోళనను కామెడీ సినిమాగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అభివర్ణించారు. మోడీ, అమిత్ షా లకు తాను ఎంత చెబితే అంత అని చెప్పుకునే పవన్ ఈ విషయమై వారిని ఎందుకు అడగలేకపోతున్నారని నాని ప్రశ్నించారు. మొదట స్టీల్ ప్లాంట్ ఎదుట, ఆ తర్వాత మంగళగిరిలో ఉద్యమం చేసిన పవన్ ఆ తర్వాత ఎక్కడ చేస్తారో అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో ప్లాంట్ గురించి పవన్ ఏమి మాట్లాడారో చెప్పాలని పేర్ని డిమాండ్ చేశారు. కేవలం తమ పార్టీపై, సిఎం జగన్ పై విమర్శలు చేయడానికే ఉద్యమాలు చేస్తున్నారని, ఇప్పుడు డిజిటల్ ఉద్యమం చేస్తామని చెబుతున్న పవన్ కొత్తగా ఏమి చేస్తారని నిలదీశారు. గతంలో ప్రత్యేక హోదా సమయంలో కూడా మీరు పదండి, నేను కూడా ఢిల్లీ వస్తానని చెప్పి రాలేదని, తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినా కూడా పవన్ స్పందించలేదని నాని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఉచితంగా సినిమా వేయనక్కర్లేదని, బ్లాక్ లో టిక్కెట్లు అమ్మకుండా ఉంటే సరిపోతుందని నాని వ్యంగ్యాస్త్రం విసిరారు.

చిలపనూలుపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సమంజసం కాదని, వెంటనే దీనిపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పేర్నినాని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేనేత రంగానికి చేయూత ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, చిలప నూలుపై పన్నును పూర్తిగా ఎత్తి వేయాలని సిఎం జగన్ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని, ఈ సమయంలో జీఎస్టీ పెంపు నిర్ణయం కేంద్రం తీసుకోవడం సరికాదన్నారు. చేనేత రంగంపై ఇది మోయలేని భారమని నాని వ్యాఖ్యానించారు. ఈ విషయమై చేనేత కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిఎం జగన్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చేదాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని, తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ మాటలు విని కొందరు అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారని నాని ఆరోపించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని ఆపి, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.\

అమరావతి రింగ్ రోడ్ పై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని నాని తీవ్రంగా ఖండించారు. 2016 లో  అమరావతి చుట్టూ 189 కిమీల ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని బాబు ప్రభుత్వం నిర్ణయించిందని నాని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 17,723  కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, 8,213 కిలో మీటర్ల భూమిని సేకరించి తనకు అప్పగించి ఇవ్వాలని కేంద్రం కోరిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఈ రింగ్ రోడ్  ఫీజిబిలిటీ నివేదిక కోసం ఓ సంస్థను కోరిందని, అయితే ఆ తర్వాత రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టును కేంద్రం పక్కన పెట్టిందని నాని వివరించారు. విషయం ఇలా ఉంటే దీనిపై ఓ పత్రికలో తమ ప్రభుత్వంపై కథనం రాయడం దారుణమైన విషయమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్